telugu navyamedia
వార్తలు

గణిత శాస్త్ర నిపుణుడు వశిష్ఠ నారాయణ్‌ సింగ్‌ .. మృతి.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు…

mathematics expret vasista narayan died

ప్రఖ్యాత గణిత శాస్త్ర నిపుణుడు వశిష్ఠ నారాయణ్‌ సింగ్‌ (74) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పట్నా వైద్య కళాశాల ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ సంతాపం తెలిపారు. వశిష్ఠ నారాయణ్‌ సింగ్‌ భోజ్‌పుర్‌ జిల్లాలోని బసంత్‌పుర్‌ గ్రామంలో జన్మించారు. ఆయనను ‘వశిష్ఠ బాబు’గా పిలుస్తుంటారు. 1969లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ‘సైకిల్‌ వెక్టార్‌ స్పేస్‌ సిద్ధాంతం’పై పీహెచ్‌డీ చేశారు. అనంతరం అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)లో పనిచేశారు. 1971లో భారత్‌కు తిరిగొచ్చారు. కాన్పూర్‌ ఐఐటీ, కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఆయన ఆచార్యుడిగా పనిచేశారు.

నారాయణ్‌ పార్థివ దేహాన్ని తరలించడానికి ఆసుపత్రి వర్గాలు సకాలంలో అంబులెన్స్‌ను సమకూర్చకపోవడం వివాదానికి దారితీసింది. మృతదేహాన్ని ఆసుపత్రిలోని అత్యవసర వార్డు వెలుపల ఒక స్ట్రెచర్‌పై ఉండటం, ఆ పక్కనే ఆయన సోదరుడు అయోధ్య ప్రసాద్‌ సింగ్‌ నిలబడిన దృశ్యాలు పలు వార్తా ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో వచ్చాయి. ఆసుపత్రి అధికారులు అంబులెన్స్‌ను ఇవ్వకపోవడం వల్లే ఆరు బయటే మృతదేహాన్ని ఉంచేయాల్సి వచ్చిందని అయోధ్య ప్రసాద్‌ సింగ్‌ ఆరోపించారు. వశిష్ఠ నారాయణ్‌ చికిత్సపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టలేదని దుయ్యబట్టారు. ఈ ఆరోపణలను రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌ కుమార్‌ ఖండించారు. ఆసుపత్రికి తీసుకురావడానికి ముందే గణిత శాస్త్రవేత్త చనిపోయారని చెప్పారు. పోస్ట్‌మార్టమ్‌ జరిపించాలా వద్దా అన్న అంశంపై వైద్యులు చర్చించుకోవడం వల్లే కొద్దిసేపు మృతదేహాన్ని అక్కడే ఉంచారని తెలిపారు. అంబులెన్స్‌ సమకూర్చడంలో ఎలాంటి జాప్యం జరగలేదన్నారు. ఈ అంశంపై విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. వశిష్ఠ నారాయణ్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Related posts