telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఫ్లైట్ అటెండెంట్ తో డేటింగ్ కోసం… విమానాన్నే ఆపేసిన 65 ఏళ్ళ వ్యక్తి

PLane

సెర్బియాకు చెందిన 65 ఏళ్ల ఓ వ్యక్తి బెల్‌గ్రేడ్ నుంచి ఫ్రాంక్ఫర్ట్ వెళ్తున్న లుఫ్తాన్సా ఏల్‌హెచ్ 411 ఫ్లైట్‌కు అబద్ధపు బాంబు బెదిరింపు కాల్ చేశాడు. ఆ విమానంలో ఉన్న ఓ సహాయకురాలి (ఫ్లైట్ అటెండెంట్) కోసం ఇలా చేశాడు ఆ వ్యక్తి. బాంబు బెదిరింపు కాల్‌తో విమానాన్ని ఆగిపోయేలా చేస్తే ఫ్లైట్ అటెండెంట్ కొన్ని గంటల పాటు అక్కడే ఉండిపోతుంది. అలా ఆమెను అక్కడే ఆగిపోయేలా చేసి ఆమెతో డేట్‌కు వెళ్లాలనేది అతడి నీచమైన కోరిక. గురువారం జరిగిన ఈ ఘటనతో విమానంలోని 130 మంది ప్రయాణీకులతో పాటు ఐదుగురు సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆ వ్యక్తి చేసిన ఫేక్ కాల్ వల్ల విమానం ఏకంగా 8 గంటల పాటు ఆలస్యమైంది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌ను సీరియస్‌గా తీసుకున్న ప్రత్యేక పోలీస్ బృందం ప్రయాణీకులతో పాటు సిబ్బందిని కిందకు దింపేసి విమానం మొత్తాన్ని సోదా చేశారు. అయితే అధికారులకు విమానంలో ఎలాంటి బాంబు దొరకలేదు. దాంతో ఫోన్ చేసిన వ్యక్తి కాల్‌ను ట్రేస్ చేసిన పోలీసులు మరుసటి రోజు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అలా ఎందుకు చేశావని అడిగితే.. సదరు వ్యక్తి చెప్పిన సమాధానం విని పోలీసులు నిర్ఘాంతపోయారు. విమానంలో ఉన్న సహాయకురాలిపై తాను మనసు పారేసుకున్నానని, అందుకే ఆమెను ఎలాగైన దేశం విడిచి వెళ్లకుండా చేసి.. ఆమెతో డేట్‌కు వెళ్లాలనేదే తన కోరిక అని చెప్పాడు. అది విన్న పోలీసులు షాకయ్యారు. శనివారం సదరు వ్యక్తిని పోలీసులు కోర్టులో హాజరుపరచగా తన నేరాన్ని అంగీకరించాడు. దాంతో న్యాయస్థానం అతడ్ని పోలీస్ కస్టడీకి అప్పగించింది.

Related posts