telugu navyamedia
సినిమా వార్తలు

“మజిలీ” మా వ్యూ

Majili

బ్యాన‌ర్‌ : షైన్ స్క్రీన్స్
నటీనటులు : నాగ‌చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాన్ష కౌశిక్‌, పోసాని త‌దిత‌రులు
దర్శకుడు : శివ నిర్వాణ‌
నిర్మాతలు : హ‌రీష్ పెద్ది, సాహు గార‌పాటి
కెమెరా: విష్ణు శ‌ర్మ‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి
సంగీతం : గోపీ సుంద‌ర్‌,
నేపథ్య సంగీతం : త‌మ‌న్‌

అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన “మజిలీ” చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెళ్ళైన తరువాత సమంత, నాగ చైతన్య జంటగా నటిస్తున్న మొదటి చిత్రం “మజిలీ కావడంతో… ఈ చిత్రంపై సహజంగానే భారీ అంచనాలు పెరిగాయి. ఇక ప్రీమియర్ షోలకు కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన “మజిలీ” సమంత, నాగచైతన్యకు ఎలాంటి అనుభూతిని మిగిల్చిందో చూద్దాం.

కథ :
హీరో పూర్ణ (నాగ‌చైత‌న్య‌)కు క్రికెట్ అంటే పిచ్చి ఇష్టం. ఇండియ‌న్ రైల్వేస్ త‌ర‌ఫున ఆడాలనేది పూర్ణ ఇష్టం. తొలి మ్యాచ్‌లోనే అక్క‌డున్న నేవీ టీమ్ పై గెలుస్తాడు పూర్ణ. అత‌నిలోని క‌సిని, టాలెంట్ ను చూసిన కోచ్ శ్రీను (ర‌విప్ర‌కాష్‌) పూర్ణను బాగా ఎంక‌రేజ్ చేస్తాడు. అదే స‌మ‌యంలో పూర్ణ, అన్షు (దివ్యాన్ష కౌశిక్‌)ను ప్రేమిస్తాడు. కానీ అన్షుకు అప్పటికే కునాల్ అనే వ్య‌క్తితో నిశ్చితార్థం జరిగిపోతుంది. పోలీస్ ఆఫీసర్ అయిన అన్షు తండ్రి (అతుల్ కుల‌క‌ర్ణి)కి అన్షు, పూర్ణల ప్రేమ విషయం తెలుస్తుంది. అది ఆయనకు నచ్చదు. దీంతో ఈ ఇద్దరినీ విడ‌గొడ‌తాడు. ఇదంతా జరిగిన ప‌దేళ్ల త‌ర్వాత పూర్ణకు శ్రావ‌ణి (స‌మంత‌)తో వివాహం జ‌రుగుతుంది. పేరుకు దంపతులే అయినా వారిద్ద‌రి మ‌ధ్య అన్యోన్య‌త ఉండ‌దు. భర్త చేసే పనులను ఓపికగా భరిస్తుంది శ్రావణి. ఇలాంటి వీరి జీవితంలోకి మీరా వ‌స్తుంది. అసలు మీరా ఎవ‌రు? ఆమెకు అన్షుకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆమెకు పూర్ణ‌కు మధ్య సంబంధం ఏంటి? మీరా రాక‌తో పూర్ణ, శ్రావ‌ణి జీవితాల్లో మార్పు వచ్చిందా ? చివరికి ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండి తెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
పెళ్లికి ముందు ప్రేమించిన అమ్మాయి, ఇష్టం లేని పెళ్లి తరువాత భార్య… వీరిద్దరి మధ్య మాన‌సిక సంఘ‌ర్ష‌ణ పడే యువకుడిగా నాగ చైతన్య బాగా నటించాడు. నిజానికి ఈ సినిమాలో నాగ చైతన్య నటనలో మరో మెట్టు ఎక్కినట్లే. ఇక ప్రేయసిని పోగొట్టుకుని బాధపడుతున్న భర్తకు తోడుగా, ఆయన మంచిని కోరే ఇల్లాలిగా సమంత అద్భుతంగా నటించింది. సినిమాలో సమంతా, చైతు జీవించేశారు. పాత్రలకు ప్రాణం పోశారని చెప్పొచ్చు. దివ్యాన్ష కౌశిక్ కు ఇది తొలి సినిమానే అయినా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. రావు రమేష్, పోసాని కృష్ణమురళీ, అతుల్ కులకర్ణి, రవిప్రకాష్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమా ద్వారా లవ్, పెయిన్ ను బాగా చూపించాడు. తాను అనుకున్న పాయింట్ ను చెప్పి ప్రేక్షకులకు మెప్పించగలిగాడు. అంతేకాదు తన కథలోని ప్రతిపాత్రకూ న్యాయం చేయగలిగాడు. ద్వితీయార్థం కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ ఎమోషన్ తో ప్రేక్షకులను కట్టిపడేశాడు దర్శకుడు. ఇక ఈ సినిమాకు సంగీతం, కెమెరా, లొకేష‌న్లు, న‌టీన‌టుల న‌ట‌న‌, డైలాగులు, ఎడిటింగ్‌ ప్లస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. ఈ సినిమాతో నాగచైతన్యకు బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం.

రేటింగ్ : 3/5

Related posts