telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

లోకేష్ .. గుంటూరు నుండేనా ..?

నిన్న మెున్నటి వరకు ఉత్తరాంధ్ర లేదా రాయలసీమ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగిన లోకేష్ మాత్రం గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచే పోటీ చెయ్యాలని భావిస్తున్నారని తెలుస్తోంది. తొలుత తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే నారా లోకేష్ అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి పొందారు. ఆ తర్వాత జరిగిన కేబినేట్ విస్తరణలో ఏపీ సీఎం చంద్రబాబు లోకేష్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. ప్రస్తుతం లోకేష్ మంత్రిగా రెండో సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నారు కూడా.

గతంలో పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించిన లోకేష్ మంత్రి పదవి పొందాక మంత్రిగా తన శాఖలపై పట్టు సాధించారని ప్రచారం. ప్రతిపక్ష పార్టీలు లోకేష్ పై ఘాటు విమర్శలు చేసినప్పటికీ వాటికి ధీటుగా సమాధానాలిస్తూ లోకేష్ ప్రభుత్వ పాలనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నికలలో పోటీ చేయకుండా మంత్రి అవడం లాంటి పలు విమర్శలకు చెక్ పెట్టాలంటే ఇక అసెంబ్లీ బరిలో నిలవాల్సిందేనని లోకేష్ పట్టుదలతో ఉన్న విషయం తెలిసిందే. దీనితో మొదట నుండి రాయలసీమ నుంచి పోటీ చేస్తారని కొందరు, ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారంటూ మరికొందరు ప్రచారం చేశారు.

అయితే చంద్రబాబు లోకేష్ కోసం చేసిన సర్వేలలో, గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే లోకేష్ గెలుపొందుతారని తేలిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెదకూరపాడు నియోజకవర్గంపై లోకేష్ ప్రత్యేక దృష్టిసారించారని తెలుస్తోంది. పెదకూరపాడు నియోజకవర్గం అయితే సేఫ్ అని టీడీపీలో ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర రాజధానికి అందుబాటులో ఉండటంతోపాటు తెలుగుదేశం పార్టీకి పెద్ద పట్టు ఉన్న నియోజకవర్గం కావడంతో లోకేష్ గెలుపు నల్లేరుపై నడకేనని తెలుస్తోంది. ప్రస్తుతం పెదకూరపాడు ఎమ్మెల్యేగా టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నారు. కొమ్మాలపాటి శ్రీధర్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి లోకేష్ ను బరిలోకి దించుతారని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే లోకేష్ అభ్యర్థిత్వంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Related posts