telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు .. రిజర్వేషన్లు ఖరారు.. !

రాష్ట్రంలో ఇప్పటికే మండల, జిల్లా పరిషత్ స్థానిక సంస్థల పదవీకాలం ముగిసింది. దీనితో ఈ ఎన్నికలను మే, జూన్ లో నిర్వహిస్తామని తెలంగాణ ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ అన్నిరకాల పదవులకు రిజర్వేషన్లను ఏ విధంగా నిర్ధారించాలో పేర్కొని జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు పంపించింది. రాష్ట్రంలో మొత్తం 535 మండల పరిషత్ అధ్యక్ష పదవులు ఉండబోతున్నాయి. వీటిలో షెడ్యూల్ ప్రాంతాల్లో సహా ఎస్టీలకు 57, ఎస్సీలకు 101, బీసీలకు 121 స్థానాలకు కేటాయిస్తారు. షెడ్యూల్ ప్రాంతాల్లో తప్పించి మిగతా చోట్ల అన్నిరకాల రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితమవుతాయి.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ విధంగా రిజర్వేషన్ల ప్రక్రియను రూపొందిస్తోంది ప్రభుత్వం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ కు కూడా ఈ విధానంలో రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టంచేసింది. ఈ మేరకు అన్ని పదవులకు సంబంధించి ఏ రీతిలో నిర్ధారించాలో పేర్కొంటూ జిల్లాలకు ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా పంపించింది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా, బీసీలకు వారి ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్లను కేటాయిస్తారు. ఏయే వర్గాలవారికి ఎన్ని స్థానాలనేది ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు జిల్లా కలెక్టర్లు, జిల్లా, మండల పరిషత్ లకు పంచాయతీరాజ్ కమిషనర్ నిర్ధారిస్తారు. ఎప్పటిలాగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికను ప్రత్యక్షంగా .. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవులను పరోక్ష పద్ధతిలోనే చేపడుతారు. ఎంపీటీసీ రిజర్వేషన్లకు మండలం, జడ్పీటీసీకి జిల్లాను యూనిట్లుగా తీసుకుంటారు. ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవీకి మాత్రం రాష్ట్రం యూనిట్ గా ఉంటుంది. అన్ని పదవుల్లో 50 శాతాన్ని మహిళలకు లాటరీ ద్వారా కేటాయిస్తామని స్పష్టంచేశారు.

535 రెవెన్యూ మండలాలలో షెడ్యూల్ మండలాలు 24 కాగా, నాన్ షెడ్యూల్ 511 ఉన్నాయి. షెడ్యూల్ ప్రాంతాల్లోని 24 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు ఎస్టీలకే చెందుతాయి. నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో ఎస్టీ జనాభా 6.40 శాతం ఉండటంతో వారికి మరో 33 అధ్యక్ష పదవులు ఇక్కడ రిజర్వవుతాయి. ఇలా ఎస్టీకి రెండు చోట్ల కలిపి మొత్తం 57 ఎంపీపీ పదవులు దక్కుతాయి. ఎస్సీ జనాభా 19.67 శాతం ఉన్నందున వారికి 101 ఎంపీపీ పదవులు దక్కుతాయి. మొత్తం 50 శాతంలోనూ ఇలా వీరికి ఇవ్వగా మిగిలే 121 స్థానాలు బీసీలకు చెందుతాయి. మిగిలిన 256 అధ్యక్ష పదవులు ఆన్ రిజర్వ్ డ్ వర్గీకరణలో చేరి ఎవరైనా పోటీ చేసేందుకు వీలుగా ఉంటాయి. జెడ్పీటీసీ స్థానాలను ఎస్టీలకు, ఎస్సీలకు వారి జనాభా ఆధారంగా, బీసీలకు వారి ఓటర్ల సంఖ్య ఆధారంగా కేటాయిస్తారు. జెడ్పీ చైర్ పర్సన్ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వగా మిగిలినవి ఆన్ రిజర్వ్ డ్ వర్గీకరణలో ఉంటాయి.

Related posts