telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

సాహితీవేత్త డాక్టర్‌ ఎం.చిదానందమూర్తి .. మృతి..

Litterateur dr.m.chidanandamurti died

బాషా సంస్కృతి కోసం దశాబ్దాల కాలం రచనలు, ప్రసంగాల ద్వారా ఆదర్శనీయంగా నిలిచిన సాహితీ మకుటం కనుమరుగయ్యారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ ఎం.చిదానందమూర్తి (88) ఇకలేరు. కన్నడ గాంధీగా చిదాదానందమూర్తిని కొనియాడేవారు. ప్రధానంగా కన్నడ భాషకు ప్రాచీన హోదా దక్కేందుకు కారకులైన వారిలోనూ చిదానందమూర్తి ముఖ్యులు. కర్ణాటక చరిత్ర పట్ల అపారమైన పరిశోధనలు చేశారు. ప్రత్యేకించి దశాబ్ద కాలంగా టిప్పుసుల్తాన్‌ దోపిడీపై ఆయన పలు సభల్లో ప్రస్తావించారు. మూడేళ్ళ క్రితం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం టిప్పు జయంతి జరిపేందుకు సిద్దం కావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య పట్ల ఆయన పరుషంగానే మాట్లాడారు. 1931లో మే 10న దావగెరె జిల్లా, చెన్నగిరి తాలూకా, హీరోకోగలూరులో జన్మించిన ఆయన ప్రాథమిక విద్య అక్కడే పూర్తి చేశారు. ఇంటర్‌లో రాష్ట్ర స్థాయిలో పదోర్యాంక్‌ సాధించిన ఇంజనీరింగ్‌, మెడికల్‌ వంటి కోర్సులకు వెళ్ళకుండా, కన్నడ భాషపై మక్కువతో డిగ్రీ చేశారు. బెంగళూరు, తుమకూరుతో పాటు కన్నడ అధ్యాపకుడిగా వ్యవహరించారు. 1968లో రీడర్‌గా బెంగళూరు విశ్వవిద్యాలయంలో చేరి 1990లో రిటైర్డ్‌ అయ్యారు. 1988లోనే కన్నడ శక్తి కేంద్రం ద్వారా భాష కోసం పోరాటం చేశారు. సుదీర్ఘకాలం పాటు చరిత్ర పరిశోధకులుగా వ్యవహరించిన ఆయన రాష్ట్రంలో జరిగిన ఎన్నో ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్‌ ద్వారా తన సంతాపం వ్యక్తం చేశారు. చిదానందమూర్తి మృతి పట్ల ముఖ్యమంత్రి యడియూరప్ప సంతాపం వ్యక్తం చేశారు. డీసీఎంలు అశ్వర్థనారాయణ, లక్ష్మణ సవది, గోవిందకారజోళలు ప్రత్యేక ప్రకటనల ద్వారా సంతాపం తెలిపారు. మాజీ ప్రధాని దేవేగడ, మాజీ సీఎంలు సిద్దరామయ్య, కుమారస్వామిలతో పాటు రాష్ట్ర, కేంద్ర మంత్రులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఉడిపి పెజావర మఠాధిపతి విశ్వ ప్రసన్న తీర్థస్వామిజీ, శాసనసభ స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డే కాగేరీ, బీజేపీ అధ్యక్షులు నళిన్‌కుమార్‌ కటీల్‌, రంగస్థల నటులు టీ.ఎన్‌.సీతారామ్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ భాస్కర్‌ రావులు సంతాపం వ్యక్తం చేశారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి పొద్దుపోయాక కన్నుమూసిన చిదానందమూర్తి పార్థివ దేహాన్ని శనివారం ఉదయం ఆయన నివాసానికి తరలించారు. ఆదివారం చామరాజపేటలోని వీరశైవ రుద్రభూమిలో అంత్యక్రియలు జరుపుతామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. సాహితీవేత్తలు, కన్నడ సంఘాల ముఖ్యులు పెద్దఎత్తున ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు.

Related posts