telugu navyamedia
సినిమా వార్తలు

చెన్నై న‌గ‌రం నీరు లేని న‌గ‌రంగా మారింది… హాలీవుడ్ హీరో కామెంట్స్

Leonardo DiCaprio

ప్రస్తుతం చెన్నై నగర ప్రజలు తాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్నారు. దేశంలోని ఆర‌వ పెద్ద న‌గ‌రం చెన్నైలోని ప్ర‌ధాన జ‌లాశ‌యాలు అన్ని ఎండిపోవ‌డంతో అక్కడి ప్ర‌జ‌లు దాహ‌ర్తితో అల‌మ‌టిస్తున్నారు. కొన్ని కంపెనీలు నీటి స‌మ‌స్య వ‌ల‌న ఇంటి నుండే ప‌ని చేయాల‌ని ఉద్యోగుల‌కు సూచించాయి. హోట‌ల్స్‌లో కూడా త‌క్కువ మోతాదులో నీటిని ఇస్తున్నారు. ఇటీవ‌ల రజనీకాంత్‌ అభిమాన సంఘమైన ‘రజనీ మక్కల్‌ మంద్రం’ చెన్నై ప్ర‌జ‌ల‌కి ఉచితంగా నీటిని సరఫరా చేసింది. ట్యాంకర్ల ద్వారా చెన్నైలోని పలు ప్రాంతాలలోని ప్రజలకు నీరు సరఫరా చేసింది. ఈ నేప‌థ్యంలో చెన్నై నగర ప్రజలకి సాయం అందించేందుకు ప‌లువురు సెల‌బ్రిటీలు ముందుకొస్తున్నారు. త‌మిళ‌నాడు ముఖ్య మంత్రి ప‌ళ‌ని స్వామి కూడా నీటి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న చెన్నై ప్ర‌జ‌ల‌ని ఆదుకునేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. రైళ్ల ద్వారా చెన్నైకు తాగునీటిని తీసుకొచ్చేందుకు రూ.65 కోట్లు కేటాయించారు.

తాజాగా ప్ర‌ముఖ హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో కూడా ఈ విష‌యంపై స్పందించారు. బావి ద‌గ్గ‌ర నీటి కోసం వేచి చూస్తున్న మ‌హిళ‌ల‌కి సంబంధించిన ఫోటో కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌డంతో ఆ ఫోటోని త‌న ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేస్తూ… వ‌ర్షం మాత్ర‌మే చెన్నైని ఈ ప‌రిస్థితి నుండి ర‌క్షించ‌గ‌ల‌దు. చెన్నై న‌గ‌రం నీరు లేని న‌గ‌రంగా మారింది. బావులు అన్ని ఖాళీ అయ్యాయి. నాలుగు ప్రధాన నీటి జలాశయాలు పూర్తిగా ఎండిపోయిన తరువాత దక్షిణ భారత నగరం చెన్నై సంక్షోభంలో ప‌డింది. నీటి కొర‌త న‌గ‌ర ప్ర‌జ‌ల‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అత్య‌వ‌స‌రాల ప‌రిష్కారాల కోసం పెనుగులాట జ‌రుగుతుంది. ప్ర‌భుత్వం, నిర్వాసితులు అందించే నీళ్ళ కోసం గంట‌ల త‌ర‌బ‌డి వేచి చూడాల్సి వ‌స్తుంది. నీటి మట్టాలు క్షీణించడంతో, హోటళ్ళు మరియు రెస్టారెంట్లు తాత్కాలికంగా మూసివేస్తున్నారు. మెట్రోలో ఏసీ వినియోగం ఆపేశారు. అధికారులు నీటి కోసం ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ని అన్వేషిస్తూనే ఉన్నారు. కొంద‌రు నీటి కోసం ప్రార్ద‌న‌లు చేస్తూనే ఉన్నారు అని లియోనార్డో త‌న పేజ్‌లో పేర్కొన్నారు.

Related posts