telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అక్కినేని, దాసరి మైత్రికి పునాది

Dasari

ఈరోజు దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి 3వ వర్ధంతి. దాసరి నాయన రావు గారు తెలుగు సినిమా అభ్యున్నదికి ఎంతో కృషి చేశారు. స్వార్ధం, స్వలాభం చూసుకోకుండా అహర్నిశలు సినిమా పరిశ్రమ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు. దాసరి నారాయణరావు గారు చనిపోయి అప్పుడే మూడు సంవత్సరాలు పూర్తి అవుతుంది. అయినా ఆయన లేని లోటు సినిమా రంగానికి ప్రతి క్షణం గుర్తుకొస్తూనే వుంది. దాసరిని అందరూ భోళాశంకరుడు అని అంటారు. ఆ మాటలు ఎన్నో సందర్భాల్లో నిజమయ్యాయి.

Dasari

దాసరి నారాయణ రావు గారి వ్యక్తిత్యం గురించి ఓ సంఘటన తెలియజేస్తాను. 1979 నాటి అరుదైన సంఘటన. అయితే దీనికి ముందు నేపథ్యం తెలుసుకోవాలి. అక్కినేని నాగేశ్వరరావు గారు మద్రాస్ నుంచి హైదరాబాద్ కు మకాం మార్చి ఇక్కడ సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చెయ్యడంలో భాగంగా ఆయన నటించే సినిమా షూటింగులన్నీ హైదరాబాద్ లోనే అని ప్రకటించారు. ఆయన నిర్మాతలు తమ చిత్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ లోనే తీయడం మొదలు పెట్టారు. మొదట్లో అక్కినేని సినిమాల షూటింగులు శ్రీసారధి స్టూడియోస్ లో జరిగేవి.

Dasari

అయితే సారధి స్టూడియోస్ యాజమాన్యంతో అక్కినేనికి మనస్పర్థలు వచ్చాయి. అందువల్ల ఆయన సినిమా షూటింగులు ఆ స్టూడియోస్ లో జరిగే అవకాశం లేదు. అందుకే తనకంటూ ఓ ఫిలిం స్టూడియో వుండాలనుకున్నాడు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారిని సంప్రదిస్తే ఆయన వెంటనే అంగీకరించి బంజారాహిల్స్ లో 22 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 1975లో అక్కినేని అన్నపూర్ణ స్టూడిస్ ను రికార్డు సమయంలో నిర్మించారు. అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ తో ప్రారంభోత్సవం చేయించారు. స్టూడియోలో షూటింగ్ లు మొదలైన తరువాత 1979లో అక్కినేని ఓ నిర్ణయం తీసుకున్నారు. తాను కూడా స్వంతంగా సినిమాలు నిర్మించాలని. ఆ నిర్ణయాన్ని ఆయన శ్రీమతి అన్నపూర్ణమ్మ కూడా సమర్ధించారు. అన్నపూర్ణమ్మ గారు నవలలు బాగా చదివేవారు. ఆమె బాగున్నాయని అనుకున్న వాటిని నాగేశ్వరరావు గారికి చెప్పేవారు. అలా ఆయన ఎన్నో నవలా చిత్రాల్లో నటించారు. అక్కినేని స్వంత సినిమాలు నిర్మిద్దామని అనగానే ఆమెకు అంతకు ముందే చదివిన “రాగమయి” అన్న నవల గుర్తుకు వచ్చింది. ఆ నవలను శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి రచించారు. ఈ కథను అన్నపూర్ణమ్మ చెప్పగానే నాగేశ్వరరావు గారికి కూడా నచ్చింది. ఇంకేం ప్రొడక్షన్ మొదలు పెడదాం అనుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ రిజిస్టర్ చేయించారు.

Dasari

వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని నిర్మాతలు. అప్పట్లో దర్శకుడుగా మంచి పేరున్న దాసరి నారాయణరావు గారిని సంప్రదించారు. ఆయన నాగేశ్వరరావు గారి స్వంత సినిమా… అదీకాక అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తనతో ప్రారంభం కాబోతుంది. అందుకే ఆనందంగా ఒప్పుకున్నారు. అయితే “రాగమయి” నవలను సినిమాగా తీద్దామని అనుకున్న తరువాత ఆ సినిమాకు “కళ్యాణి” అనే పేరు నిర్ణయించారు. దాసరి నారాయణరావు గారు స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టారు. ఇక నాగేశ్వరరావు గారు అన్నపూర్ణమ్మకు మెస్ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఎన్నో సినిమాల్లో నటించినప్పుడు. కొంతమంది నిర్మాతలు మాత్రం యూనిట్ సభ్యులకు మంచి భోజనాలు పెట్టేవారు. మరికొందరు మొక్కుబడిగా పెట్టేవారు. దీనిపై నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆ నిర్మాతను తిట్టుకోవడం నాగేశ్వరరావు గారు విన్న సందర్భాలు వున్నాయి. అందుచేత తమ సంస్థ నిర్మించే సినిమాల విషయంలో అలాంటి విమర్శలు రాకూడదు. అందరికీ మంచి భోజనం పెట్టాలి. అందరినీ ఆత్మీయంగా చూసుకోవాలి అని అక్కినేని అన్నపూర్ణమ్మతో చెప్పారు. అందుకే ఆమె మెస్ వ్యవహారాలు చూసుకునేవారు.

Dasari

ఇక “కళ్యాణి” సినిమాలో ఎవరెవరు నటీనటులు ఉండాలి అని దాసరి, అక్కినేని అనుకున్నారు. ఒకరోజు ఉదయమే అక్కినేని హీరో పాత్రకు అనుకున్న మురళి మోహన్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. మురళి మోహన్ వెంటనే “తప్పకుండా చేస్తా సర్” అన్నాడు.
“మరి మీ పారితోషికం” అని అడిగారు అక్కినేని.
“దానికేముంది సర్.. మీరు ఆ పాత్రకు ఎంత అనుకుంటే అంత.. పైగా మా గురువు గారు దర్శకులు .. ఇది మరింత సంతోషం” అని మురళి మోహన్ సమాధానం చెప్పాడు.
ఇక ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకు అనుకున్న నటికి ఫోన్ చేశారు.
ఆమెతో తాము నిర్మాణ రంగంలోకి వస్తున్నామని, మొదటి సినిమాకు దర్శకుడుగా దాసరిని నిర్ణయించామని చెప్పారు.
ఫోన్లోనే ఆ నటి నాగేశ్వరరావు గారికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పింది.
నాగేశ్వరరావు గారు థాంక్స్ చెప్పారు .
“కళ్యాణి” సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందని కాబట్టి ఆ పాత్రకు మిమ్మల్ని అనుకుంటున్నామని చెప్పారు.
“థాంక్ యూ సర్ ” అన్నది.
“మరి మీ పారితోషికం ?” అని అక్కినేని ఆమె సమాధానం కోసం ఆగాడు.


వెంటనే ఆ నటి “నాగేశ్వరరావు గారు మీరు నా సెక్రటరీతో ఆ విషయం మాట్లాడండి” అని చెప్పింది.
ఆ సమాధానం నాగేశ్వరరావు గారికి షాకింగ్ గా అనిపించింది. ఏమి మాట్లాడాలో తెలియలేదు. ఫోన్ పెట్టేశాడు.
అది ఆయనకు చాలా అవమానంగా అనిపించింది. ఇంత పెద్ద నటుణ్ని అని కూడా చూడకుండా తన సెక్రటరీతో మాట్లాడమంటుందా ? ఆయనకు ఆ నటిపై చెప్పలేనంత కోపం వచ్చింది.
ఆరోజు సాయంత్రం దాసరి నారాయణరావు గారిని స్టూడియోస్ కు రమ్మని జరిగిన విషయం చెప్పి బాధ పడ్డారు.
“అయినా మీరెందుకు మాట్లాడారు సార్.. మీ స్థాయి తగ్గించుకోవద్దు. ఆ అహంకార పూరితమైన హీరోయిన్ మనకొద్దు. ఆ పాత్రకు జయసుధను పెట్టేద్దాం. నేను మాట్లాడతాను.
“కళ్యాణి” సినిమా నా స్వంత సినిమా అనుకుంటాను. ఇక నుంచి అన్నీ నేను చూసుకుంటాను”అని దాసరి నారాయణరావు హామీ ఇచ్చారు. అప్పుడు నాగేశ్వరరావు గారు స్థిమిత పడ్డారు.
“కళ్యాణి” సినిమా దాసరి, అక్కినేని బంధానికి పునాది వేసిందని చెప్పవచ్చు.
దాసరి నారాయణరావు గారు భోళా శంకరుడే కాదు… మానవత్వానికి, మంచితనానికి ఓ మెచ్చుతునక.

– భగీరథ

Related posts