telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మా వ్యూ..

rgv lakshmis ntr movie trailer on 14 feb

స్టార్ కాస్ట్ : విజయ్ కుమార్‌, యజ్ఞ శెట్టి, శ్రీతేజ్ తదితరులు..
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ..అగస్త్య మంజు
నిర్మాతలు: రాకేష్ రెడ్డి
మ్యూజిక్ : కళ్యాణ్ మాలిక్
విడుదల తేది : మార్చి 29, 2019

రివ్యూ : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’

వివాదాస్పద డైరెక్టర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరవాత జరిగిన పరిణామాలు.. లక్ష్మీ పార్వతి మూలంగా ఎన్టీఆర్‌కు ఆయన కుటుంబం దూరమైన విధానం.. చంద్రబాబు నాయుడు చేసిన వెన్నుపోటు.. వంటి ప్రధాన అంశాలను బేస్ చేసుకుని వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండే ఈ సినిమాను అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కోర్టుల వరకు వెళ్లడం రిలీజ్ డేట్ ఫై ప్రజల్లో ఖంగారు పెట్టించడం..ఎన్నో అడ్డంకులు తెచ్చినప్పటికీ వర్మ మాత్రం అస్సలు తగ్గలేదు. అనుకున్నట్లే సినిమాను పూర్తి చేసి..ప్రేక్షకుల ముందుకు ఈరోజు తీసుకొచ్చాడు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వర్మకు ఎదురుదెబ్బ తగిలింది. సినిమాను విడుదల చేయడానికి వీళ్లేదంటూ ఏపీ హైకోర్టు స్టే విధించింది. దీంతో ఏపీ మినహా మిగతా ప్రాంతాల్లో ఈ సినిమాను విడుదల భారీ ఎత్తున విడుదల చేసారు. మరి ట్రైలర్స్ లలో చూపించినట్లు సినిమా ఉందా..? చంద్రబాబు వెన్నుపోటు ను ఎలా చూపించాడు..? వర్మ ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్లేనా..? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :
సినిమా ప్రచారం లో చెప్పినట్లే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశం నుండి సినిమా కథను మొదలు పెట్టాడు వర్మ. ఎన్టీఆర్ (విజయ్ కుమార్‌) అధికారం కోల్పోయి ఒంటరిగా ఉన్న సమయంలో ఆయన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ (యజ్ఞ శెట్టి) వస్తుంది. ఆమె గురించి తెలుసుకున్న ఎన్టీఆర్‌ తన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ కి అనుమతి ఇస్తాడు. అలా ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించిన లక్ష్మీ పార్వతి అతి తక్కువ సమయంలోనే ఎన్టీఆర్ కు బాగా దగ్గరవుతుంది. ఇది చూసిన ఎన్టీఆర్ అల్లుడు బాబు..లక్ష్మీ పార్వతి ఫై దుష్ప్రచారం చేయడం..కుటుంబ సభ్యులకు ఆమెకు గొడవలు పెట్టడం చేస్తుంటాడు. అసలు లక్ష్మీ పార్వతి ఎవరు..? ఆమెకు మన కుటుంబానికి సంబంధం ఏంటి..? ఆమె ఇక్కడ అవసరమా..అంటూ కుటుంబ సభ్యులను తన మాటలతో రెచ్చగొడతాడు. దానితో ఎన్టీఆర్ ఫై కుటుంబ సభ్యుల ఒత్తిడి పెరుగుతుంది.

లక్ష్మి పట్ల పూర్తి నమ్మకం ఉన్న ఎన్టీఆర్..మేజర్ చంద్రకాంత్ సినిమా ఫంక్షన్‌లో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటిస్తాడు. ఈ ప్రకటన తో అంతా షాక్ అవుతారు..తెలుగుదేశం కార్య కర్తలు..అభిమానులు సంబరాలు చేసుకుంటే..ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు..బాబు మాత్రం ఎన్టీఆర్ ఫై కోపం పెంచుకుంటారు.

ఎలాగైనా లక్ష్మీ ని ఎన్టీఆర్ నుండి దూరం చేయాలనీ ఓ పత్రికా అధిపతితో కలిసి లక్ష్మీ పార్వతి మీద చెడు ప్రచారం మొదలు పెడతాడు. అయినాగానీ ప్రజలు నమ్మలేదు..ఎన్టీఆర్ ..లక్ష్మీ లకు నీరాజనాలు పలికారు. లక్ష్మీ తో కలిసి ప్రచారం చేసిన ఎన్టీఆర్‌ భారీ మెజారిటీ సాధించి తిరిగి అధికారం చేపడతాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి..? ఎన్టీఆర్‌పై వైస్రాయ్‌ హోటల్‌ దగ్గర చెప్పులు ఎందుకు వేయాల్సి వచ్చింది..? ఎన్టీఆర్ ను బాబు ఎలా మోసం చేసాడు..? బాబు కుటుంబ సభ్యులను ఎలా రెచ్చగొట్టాడు..? బాబు ఎన్టీఆర్ ను ఎలా వెన్నుపోటు పొడిచాడు..? బాబు సీఎం ఎలా అయ్యాడు..? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు తెరఫై చూడాల్సిందే.

ప్లస్ :

* డైరెక్షన్
* ఎమోషనల్ సన్నివేశాలు
* నటి నటుల నటన
* కథ – కథనం
* క్లైమాక్స్

మైనస్ :
* కాస్త స్లో నేరేషన్

నటీనటుల పెర్పామెన్స్ :
* నటన లో టాలెంట్ ఉండాలే కానీ వారు అగ్ర నటి నటులా..వారికీ బ్యాక్ గ్రౌండ్ ఉందా ఇవన్నీ అవసరం లేదని వర్మ ఈ సినిమా తో నిరూపించాడు. సినిమాలో కీలకమైన పాత్రలకు అంత కొత్త వారినే తీసుకొని పెద్ద సాహసమే చేసి సక్సెస్ అయ్యాడు. ఎన్టీఆర్ పాత్రలో నటించిన విజయ్‌ కుమార్‌ కు ఇది మొదటి సినిమా..అయినప్పటికీ ఏ మాత్రం బెరుకు లేకుండా సీనియర్ నటుడికి దీటుగా నటించాడు. ఎన్టీఆర్‌ హావభావాలను, డైలాగ్ డెలివరినీ చాలా బాగా తెర మీద చూపించాడు. వర్మ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. నిజంగా తెరపై ఎన్టీఆర్ ను చేస్తున్నట్లే అనిపిస్తుంది తప్ప ఇతడు ఓ రంగస్థల నటుడు కదా అని ఏమాత్రం అనిపించదు.

* లక్ష్మీ పార్వతి పాత్రలో నటించిన యజ్ఞశెట్టి తన పాత్రకు ప్రాణం పోసింది. టైటిల్ రోల్ పోషించిన ఈమె తన నటన..హావభావాలతో తన టాలెంట్ ఏంటో నిరూపించింది.అమాయకత్వం, నిష్కల్మశమైన ప్రేమ, బాధ, వేదన, అవమాన భారం ఇలా ఒకటనే కాదు అన్ని భావాలను తెరమీద చూపించి శభాష్ అనిపించుకుంది.

* చంద్రబాబు పాత్రలో నటించిన శ్రీతేజ్..నిజంగా తెరఫై చంద్రబాబు ను చేస్తున్నట్లే అనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా శ్రీతేజ్ అనిపించదు. అంతలా తన నటనతో అదరగొట్టాడు.. బాబులాగే చూపులు.మాటలు అంత బాబే అనిపించేలా చేసాడు.

* రామ సుబ్బా రెడ్డి పాత్రలో అనింగి రాజశేఖర్ ఆకట్టుకున్నారు.

* కుటుంబ సభ్యులుగా నటించిన వారంతా కొత్తవారే అయినప్పటికీ ఎక్కడ కూడా కొత్త అనే తేడా లేకుండా నటించి తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక విభాగం :

* ఈ చిత్రానికి సంగీతం అందించిన కళ్యాణ్ మాలిక్ పూర్తి న్యాయం చేసాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా స్థాయి పెంచాడు. ఎన్టీఆర్ – లక్ష్మి ల మధ్య వచ్చే సన్నివేశాలకు..ఎన్నికల ప్రచారంలో..బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ లోనైనా ఇలా ప్రతి ఫ్రెమ్ లో తన మార్క్ మ్యూజిక్ చూపించి సక్సెస్ అయ్యాడు.

* ఇక రమ్మీ సినిమా ఫొటోగ్రఫీ సైతం ఆకట్టుకుంది. ప్రతి ఫ్రేమ్ ను ఎంతో అందంగా చూపించారు.

* ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో కాస్త స్లో అయినట్లు అనిపిస్తుంది.

* ఇక నిర్మాణ విలువల విషయానికి వస్తే..తక్కువ బడ్జెట్లో సినిమాను పూర్తి చేసి సక్సెస్ అయ్యారు. భారీ కాస్ట్; క్రూ ను పెట్టుకోకుండా అంత కొత్తవారినే పెట్టుకుని వారి టాలెంట్ ను బయటకు తీశారు. ఎన్ని అడ్డంకులు వచ్చిన కానీ సినిమాను విజయవంతంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు.

* ఇక డైరెక్టర్స్ వర్మ..అగస్త్య మంజు విషయానికి వస్తే..ఇలాంటి కథను ఎంచుకోవడమే పెద్ద సాహసం. అలాంటి సాహసాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చిన తట్టుకొని సినిమా తీయడం నిజంగా గ్రేట్. తెలుగోడి సత్తా ను నిరూపించి ..తెరపై మహానాయకుడు అనిపించుకున్న ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించారు.

ఎన్టీఆర్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే సినిమాను తెరకెక్కించారు తప్ప లేనివి..జరగనివి ఏమి చూపించలేదు. ఎన్టీఆర్‌, లక్ష్మీల మధ్య సన్నివేశాలను వర్మ తెరకెక్కించిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రతి ఫ్రేమ్ లో చూపించారు. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి మధ్య జరిగిన ఓల్డేజ్ లవ్ స్టోరీని నేటి తరానికి నచ్చేలా అద్భుతంగా తెరకెక్కించి సక్సెస్ అయ్యారు.

ఫస్టాఫ్ అంతా ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి మధ్య వచ్చే సన్నివేశాలతోనే నడిపించారు. ఆ తర్వాత కీలకమైన సెకండాఫ్ లో అసలు కథ మొదలవుతుంది. వెన్నుపోటు ఎపిసోడ్ కాస్త ఆసక్తికరంగా సాగినా.. క్లైమాక్స్ మాత్రం ఎన్టీఆర్‌కు అన్యాయం జరిగిందనీ సెంటిమెంట్ తో తెరకెక్కించారు.

చివర్లో ఎన్టీఆర్ నిజమైన అంత్యక్రియల విజువల్స్ వేసి మరింత సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశాడు వర్మ. ఓవరాల్‌గా ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన సంఘటనలే చూపించారు. ఇక ఈ సినిమా తో వర్మ తనలోని అసలైన టాలెంట్ ను బయటకు తీసాడు. వర్మ అభిమానులకే కాదు ఎన్టీఆర్ అభిమానులకు సైతం ఈ సినిమా బాగా నచ్చుతుంది.

రేటింగ్ : 2.75/5

Related posts