telugu navyamedia
సినిమా వార్తలు

“లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల ఎప్పుడు ?

video song from varma lakshmis ntr movie
రామ్ గోపాల్ వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రం విడుదల ఈనెల 22 న లేనట్టే. . ప్రాంతీయ సెన్సార్ బోర్డుసినిమా చూడలేమని లేఖ రాయడంతో వర్మ కోర్టుకు వెడతాననని హెచ్చరించాడు . తన న్యాయవాదితో ప్రెస్ మీట్ పెడుతున్నాఅని  కూడా తన ట్విట్టర్లో ప్రకటించాడు . 
అయితే తరువాత ఏమి జరిగిందో , వర్మ ఎవరితో మాట్లాడాడో , లేదా ఎవరైనా వర్మకు ఫోన్ చేశారో తెలియదు . సమాచార లోపం వల్ల ఇదంతా జరిగిందని పేర్కొన్నాడు . హాట్ హాట్ గా వున్న వాతావరణం చల్లబడింది . సెన్సార్ బోర్డు “లక్ష్మీస్ ఎన్టీఆర్ “సినిమా చూడబోతున్నట్టు తెలిసింది . మంగళవారమా ? బుధవారమా ? ఎప్పుడు  చూస్తారు  ? అన్నది ఇంకా తెలియదు . 
మంగళవారం చూసినా లక్ష్మీస్ ఎన్టీఆర్ 22 న విడుదల చెయ్యడం కష్టం . ఎందుకంటే రెండు రాష్ట్రాల్లోనూ కనీసం వారం ముందు థియేటర్లతో అగ్రిమెంట్ చేసుకోవాలి . సినిమా సెన్సార్ అవుతుందో కాదో  ఇప్పటిదాకా తెలియలేదు కాబట్టి బయ్యర్లు థియేటర్ లను సంప్రదించలేదు . వర్మ ఎలాటి పరిస్థితుల్లోనూ  22 న విడుదల  చేస్తానని చెబుతున్నాడు . నిజానికి ఇది జరిగే పని కాదు . 
ఇక  ఈనెల 29న విడుదల చెయ్యవచ్చునని కూడా మరో  ఆలోచన కూడా ఉందని తెలిసింది .  ఇది కూడా కష్టమైన విషయమే. . ఎందుకంటే సినిమా మీద ఇప్పటికే అనేక వివాదాలు వున్నాయి . లక్ష్మీస్ ఎన్టీఆర్  చిత్రంలో ప్రధాన పాత్ర చంద్ర బాబు నాయుడు ది . ఒకవేళ  సభ్యులంతా ఈ చిత్రం విడుదల కాకూడదని అనుకుంటే ప్రాంతీయ అధికారి దీనిని రివైజింగ్ కమిటీకి పంపవచ్చు . లేదా చిత్రం చూసిన  తరువాత కొన్ని కట్స్ ఇద్దామనుకుంటే … ఆ కట్స్ అన్నీ తీసి మళ్ళీ సెన్సార్ అధికారికి చూపించాలి . అప్పుడుమాత్రమే సర్టిఫికెట్  వస్తుంది . 
ఇప్పటికే ఈ సినిమా పట్ల వున్న క్రేజ్ తో రెండు రాష్ట్రాలతో పాటు మిగతా ఏరియాలకు బయ్యర్లు కొనేశారు . ఈ నెల 29 కూడా వీలు కాకపోతే ఏప్రిల్ మొదటి వారంలో విడుదలకు ప్లాన్ చేసుకోవాలి . లక్ష్మీస్ ఎన్టీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా విడుదల కావచ్చు . కేసీఆర్  ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం వుంది . 
ఎందుకంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్ర బాబు బదనాం అయిపోతున్నాడంటే .. కేసీఆర్  అడ్డుపెట్టడు . 
సమస్యంతా  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోనే . అక్కడ తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో వుంది . ఈ సినిమాలో చంద్ర బాబు ను డామేజ్ చేసే సన్నివేశాలు ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది . కాబట్టి ఇక్కడ విడుదల చెయ్యాలంటే థియేటర్ లు కావాలి . కానీ చాలా మంది థియేటర్ లు ఇవ్వడానికి  భయపడుతున్నట్టు తెలుస్తుంది . ఒకవేళ ఎవరైనా ఇచ్చినా సినిమా విడుదల అప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు థియేటర్ ల దగ్గర ఆందోళనలు , ధర్నాలు చేసే అవకాశం వుంది . 
అది పార్టీల ఘర్షణ కు దారితీయవచ్చు . శాంతి భద్రతలకు  విఘాతం కలిగిస్తుందని పోలీసులు భావిస్తే … లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను నిషేదించవచ్చు . కాబట్టి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కు ఎటు చూసినా సమస్యలు చుట్టుముట్టేలా కనిపిస్తున్నాయి . వర్మ వీటన్నిటినీ ఎలా అతిక్రమిస్తాడో ?
-భగీరథ 

Related posts