telugu navyamedia
తెలంగాణ వార్తలు

మా సంపూర్ణ మ‌ద్ద‌తు య‌శ్వంత్ సిన్హాకే..ఎందుకంటే ?

*య‌శ్వంత్ సిన్హాకు మేం సంపూర్ణ మ‌ద్ద‌తిస్తున్నాం
*సిన్హా గెల‌వాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాం..
*నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న కేటీఆర్ , టీఆర్ ఎస్ మంత్రులు
*హైద‌రాబాద్‌కు రావాల‌ని య‌శ్వంత్ సిన్హాకు ఆహ్వానం
*ద్రౌప‌తి మూర్ముపై మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు

*బీజేపీ నిరంకుశ తీరును వ్య‌తిరేకిస్తున్నాం..
*బీజేపీ 8 ఏళ్ళుగా ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హ‌స్యం చేశారు.
*అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగాన్ని కాల‌రాశారు..
*మోదీ ప్ర‌భుత్వానికి అడ్డూ అదుపులేకుండా పోయింది.
*నోరుతో నవ్వుతూ.. నొసలుతో వెక్కిరించే బీజేపీ వైనం

రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హాకు టీఆర్ ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని, ఆయనను హైదరాబాద్‌ రావాలని ఆహ్వానించాము. ఎన్నికల్లో యశ్వంత్‌ సిన్హా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామ‌ని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలోనే టీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ఎంపీ నామ నాగేశ్వరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..బీజేపీపై విరుచుకుప‌డ్డారు ..

బీజేపీ నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థిని తిరస్కరిస్తున్నామన్నారు. భీష్ముడు మంచివాడైనా ఓటమి తప్పలేదన్నారు.ద్రౌపది ముర్ముపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, బీజేపీ నిరంకుశ వైఖరిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

దేశంలో అమలవుతున్నది అంబేద్కర్‌ రాజ్యాంగం కాదు.. బీజేపీ రాజ్యాంగం. దేశంలో మోదీ రాజ్యాంగం మాత్రమే అమలు అవుతోంది.. బీజేపీ అక్రమాలకు అడ్డు అదుపులేకుండా పోతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 8 ఏళ్లుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఒక నియంతలా, నిరంకుశ విధానాలతో పాలన సాగిస్తోందని ఆరోపించారు. ఏపీ పునర్విభజన చట్టంలోని చెప్పిన అనేక అంశాలను అమలు చేయలేదని విమర్శించారు. తెలంగాణకు ఎనిమిదేళ్లుగా మోదీ ఏం ఇచ్చారు?.ప్రతీ దానికి సమయం వస్తుంది. నరేంద్ర మోదీది దద్దమ్మ గవర‍్నమెంట్‌. మోదీ నియంతృత్వ పోకడలపై నోరు విప్పాలి. వారిలో విషం తప్ప విషయం లేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రానికి తెలంగాణ ఇచ్చినదానికంటే.. తెలంగాణకు కేంద్రం ఎక్కువ ఇచ్చిన‌ట్లు చూపిస్తే నా మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు.తెలంగాణకు ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటివరకు దాదాపు 8 రాష్ట్రాల్లో బీజేపీకు మెజారిటీ లేకపోయినా అక్కడి పరిస్థితులను తలకిందులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని బీజేపీ సద్వినియోగం చేసుకుందనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు.

రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొని విపక్షాలపై ఉసిగొల్పి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకుంటోంది. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి పార్టీ దాన్ని తిరస్కరించాల్సిన అవసరం ఉంది. అందుకే బీజేపీ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థిని తిరస్కరిస్తూ విపక్షాలు బలపర్చిన అభ్యర్థిని బలపరిచాం.

రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు మద్దతిస్తున్నామని బీజేపీ పదేపదే చెబుతుందని.. మరి గిరిజనులు, దళితుల కోసం ఆ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు.గిరిజిన జనాభా పెరిగిందని.. అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చెప్పారు. నాలుగేళ్లు గడిచిన కేంద్ర ప్రభుత్వం దానిని ఆమోదించలేదని.. ఇదేనా బీజేపీకి గిరిజనులపైనా ప్రేమ అని ప్రశ్నించారు.

బీజేపీకి చిత్త‌శుద్ధి ఉంటే తెలంగాణలో ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేయాలని, గిరిజన్లకు రిజ‌ర్వేష‌న్ల‌ను పెంచాలని, ఏపీలో కలిపిన ఏడు మండ‌లాల‌ను తిరిగి వెన‌క్కి ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Related posts