telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

మరో 20 ఏళ్లు ‘టీఆర్‌ఎస్‌’ దే అధికారం: కేసీఆర్‌

తెలంగాణ రాజకీయ క్షేత్రంలో తిరుగులేని విజయం ‘టీఆర్‌ఎస్‌’ దే అని ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ నిర్ణయాలను వెల్లడించారు.

”32 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను సీఎం కేసీఆర్‌ అక్టోబరులో ప్రారంభిస్తారు. సెప్టెంబరు 2న కేసీఆర్‌ చేతుల మీదుగా ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయం భూమి పూజ నిర్వహించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు 2న గ్రామ, వార్డు కమిటీల నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదే నెలలో జిల్లా కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం. రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రధానంగా పార్టీ రెండు దశాబ్దాల ప్రస్థానంపై చర్చించాం. అక్టోబరు లేదా నవంబరులో టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తాం. రెండు దశాబ్దాల్లో ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు సాధించాం. శాసనసభ ఎన్నికల నుంచి జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, గ్రామపంచాయతీ ఎన్నికలు .. అన్నింటిలో టీఆర్‌ఎస్‌ చిరస్మరణీయమైన విజయాలు సాధించింది. రాష్ట్రంలో ఉన్న 32 జిల్లా పరిషత్‌లు గెల్చుకున్నాం. 119 అసెంబ్లీ స్థానాల్లో 88 సీట్లు సాధించాం. 17 పార్లమెంట్‌ స్థానాలకు గాను 9 స్థానాలు కైవసం చేసుకున్నాం. సెప్టెంబరులో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించాం” అని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

రెండున్నర గంటల పాటు జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రస్థావన రాలేదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నోటిఫికేషన్‌ వచ్చాక హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై వ్యూహరచన చేస్తామన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తమకు చాలా చిన్న విషయమని వ్యాఖ్యానించారు. ” హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ కంచుకోట. హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో ప్రభుత్వం కూలిపోయేదేమీ లేదు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. దళిత బంధు అమల్లో విపక్షాలు కూడా పలు పంచుకోవాలి. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు, బీసీ బంధు అమలు చేసి చూపాలి. అత్యంత పేదరికంలో మగ్గుతున్నది దళితులే. సమాజంలో అట్టడుగున ఉన్న దళితులను ఆదుకోవడం అవసరం” అని కేటీఆర్‌ తెలిపారు.

”దళితులు సమాజంలో అట్టడుగున ఉన్నందున దళిత బంధు పథకం తెచ్చాం. ప్రాధాన్య క్రమంలో మిగిలిన వర్గాలకూ పథకాలు తీసుకొస్తాం. భవిష్యత్‌లో బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలబంధు కూడా తెస్తాం. అన్ని వర్గాల అభివృద్ధి కోసమే తెలంగాణ సాధించుకున్నాం. మరో 20 ఏళ్లు తెరాసనే అధికారంలో ఉంటుంది” అని పార్టీ నేతలకు రాష్ట్ర కమిటీ సమావేశంలో సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

Related posts