telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇది ఎన్నికల నామ సంవత్సరం: కేటీఆర్

KTR Counter pawan comments

ఇది ఎన్నికల నామ సంవత్సరమని,  త్వరలో పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ లేకుండా చూసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. లక్ష్మీపూర్ తండా స్ఫూర్తితో సిరిసిల్ల నియోజకవర్గంలో ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం కావాలన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. సిరిసిల్ల నియోజకవర్గంలో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు నా ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 15 లక్షలు ఇస్తానని కేటీఆర్ ప్రకటించారు.పంచాయతీ ఎన్నికల్లో అవకాశం రాని వారికి సొసైటీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారు. తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైందన్నారు.

ముందస్తు ఎన్నికలకు పోయి గెలిచిన ఘనత సీఎం కేసీఆర్ ది అని తెలిపారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. సంక్షేమ పథకాలను కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని దేశమంతా అమలు చేయాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు.

Related posts