telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు కేటీఆర్ లేఖ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులకు రానున్న కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. రానున్న బడ్జెట్లో హైదరాబాద్- వరంగల్ మరియు హైదరాబాద్- నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ తో పాటు హైదరాబాద్ ఫార్మా సిటీ కి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు. ప్రతిపాదిత రెండు ఇండస్ట్రియల్ కారిడార్ లకు సుమారు 5 వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని పియూష్ గోయల్ కు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు ఇండస్ట్రియల్ కారిడార్లను ముందుకు తీసుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నదని అయితే ఇందులో కనీసం 50 శాతం నిధులను రానున్న బడ్జెట్లో కేటాయించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్ ఫార్మా క్లస్టర్ అయిన హైదరాబాద్ ఫార్మా సిటీని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తుందని ఇప్పటికే ఆ దిశగా కార్యచరణ మొదలైందని కేంద్రమంత్రి రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మేకిన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ఆలోచనలను ఫార్మా సిటీ తో తెలంగాణ మరింత ముందుకు తీసుకుపోతుందన్న నమ్మకాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. ఫార్మా రంగంలో స్వదేశీ పరిశ్రమని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళే దిశగా ఫార్మాసిటీ ఉంటుందన్నారు. జాతీయ ప్రాధాన్యత ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీ కి ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు.

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నామని దేశంలో ఎక్కడా లేని విధంగా జీరో లిక్విడ్ డిస్ ఛార్జ్, కామన్ ఎప్లూయంట్ ట్రీట్మెంట్ , ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ పార్క్, గ్లోబల్ ఫార్మా యూనివర్సిటీ, కామన్ డ్రగ్ డెవలప్మెంట్, టెస్టింగ్ లాబరేటరీ, స్టార్టప్ల కోసం ప్రత్యేక హబ్ లాంటి ఎన్నో వినూత్నమైన ఆలోచనలను హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రణాళికలో ఉంచామని కేటీఆర్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇప్పటికే విస్తృతమైన పరిశీలన తర్వాత కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, కేంద్ర ప్రభుత్వ వాణిజ్య పరిశ్రమల శాఖ హైదరాబాద్ ఫార్మా సిటీకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ హోదా కల్పించాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ ఫార్మాసిటీ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీల సిద్దంగా ఉన్నాయని తెలిపారు. మొత్తం 64 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో సుమారు 5.6 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మౌలిక వసతుల సదుపాయాల కోసం సుమారు 4922 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నామన్నారు. వచ్చే బడ్జెట్ లో కనీసం 870 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని కోరారు. 

Related posts