telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్‌ ప్రజలకు గుడ్ న్యూస్‌ చెప్పిన కేటీఆర్‌…

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు త్వరలోనే హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ఈరోజు తెలిపారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 20వేల లీటర్ల వరకు నీటి వినియోగానికి ఎలాంటి చార్జీలు చెల్లించకుండా ప్రజలకు నీటి సరఫరా చేసే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అవసరమైన కసరత్తు ఈ రోజు ప్రారంభమైంది. ఈ మేరకు ప్రగతి భవన్ లో పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మరియు జలమండలి అధికారులతో ఒక సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగర ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రయోజనం కలిగేలా త్వరలోనే ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. రానున్న రెండు వారాల పాటు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించుకోవాలని ఈరోజు జరిగిన సమావేశంలో జలమండలి అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. 2021 నూతన సంవత్సర తొలి వారంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగర ప్రజలకు ఇచ్చిన మాట మేరకు డిసెంబర్ నెల నుంచి 20,000 లీటర్ల వరకు తాగు నీటి వినియోగానికి ఎలాంటి రుసుము తీసుకోమని, ఈ మేరకు జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబర్ బిల్లులో 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం కనెక్షన్లు మరియు నీటి సరఫరాకి అవసరమైన ఏర్పాట్లు, ఈ కార్యక్రమానికి సంబంధించి అవసరమైన విధి విధాన రూపకల్పన పైన ఈ సమావేశంలో మంత్రి సమీక్షించారు. ఈ ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ప్రజలకు సంపూర్ణంగా సమర్థవంతంగా వెళ్లేలా జలమండలి చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా మంత్రి కేటీఆర్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. నగర ప్రజలందరికీ ఉపశమనం కలిగించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన కార్యాచరణను పటిష్టంగా రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలను ఒకటి రెండు రోజుల్లో రూపొందించి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

Related posts