telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం అనగానే.. ఉలిక్కిపడుతున్న కేటీఆర్.. సెల్ఫీలు తెచ్చిన చిక్కులు..

ktr trs president

తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత కేటీఆరే ముఖ్యమంత్రి అని చాలామంది బలంగా ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు, సీఎంగా కేసీఆర్ తప్పుకుని కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తారన్న ఊహాగానాలు ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్నాయి. మంత్రి కేటీఆర్ ఆ ఊహాగానాలను ఎన్నోసార్లు కొట్టిపారేశారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్‌లోనూ కేసీఆర్ ఆ విషయాన్ని కొట్టిపారేశారు. తాను ఇప్పటికీ దుక్కలా ఉన్నానని డాక్టర్లు చెబుతున్నారని.. అలాంటప్పుడు ఇప్పుడే కేటీఆర్‌ను సీఎం ఎందుకు చేస్తానని ఎదురు ప్రశ్నించారు. స్వయంగా కేసీఆర్ కూడా స్పష్టతనిచ్చినా సరే.. టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కేటీఆరే కాబోయే సీఎం అంటూ ఆయన్ను ఇబ్బందిపెడుతున్నారట. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 110 మున్సిపాలిటీలు,9 కార్పోరేషన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ భవన్‌లో గత రెండు రోజులుగా.. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సభ్యులతో మంత్రి కేటీఆర్ మర్యాదపూర్వకంగా భేటీ అవుతున్నారు.

ప్రతీ ఒక్కరితో ఓపికగా మాట్లాడుతున్నారు. అడిగిన ప్రతీవారితో సెల్ఫీలు దిగుతున్నారు. అలా ఈ రెండు రోజుల్లోనే దాదాపు 2వేల పైచిలుకు మందితో కేటీఆర్ ఫోటోలు దిగారు. మున్సిపల్ సభ్యులే కాదు.. ఆఖరికి ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఆయనతో ఫోటోలు దిగుతున్నారు. ఫోటోలు దిగడం వరకు బాగానే ఉంది కానీ.. ఒక విషయం మాత్రం కేటీఆర్‌కు నచ్చడం లేదట. కేటీఆర్‌తో ఫోటోలు దిగిన చాలామంది మున్సిపల్ సభ్యులు సోషల్ మీడియాలో వాటిని అప్‌లోడ్ చేస్తూ.. ‘కాబోయే సీఎంతో..’ అనే క్యాప్షన్ పెడుతున్నారట. ఈ విషయం కేటీఆర్ దృష్టికి రావడంతో టీఆర్ఎస్ శ్రేణులను ఆయన సున్నితంగా హెచ్చరించారట. కాబోయే సీఎం అనే క్యాప్షన్ పెట్టవద్దని చెప్పారట. ఏదేమైనా కేటీఆర్‌తో ఫోటో అంటేనే టీఆర్ఎస్ కార్యకర్తలు,నేతలు క్రేజీగా ఫీలవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

కాబోయే సీఎం కాబట్టే.. మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు కూడా ఆయనతో ఫోటోలు దిగుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించి.. మరోసారి తన సత్తా నిరూపించుకున్న కేటీఆర్‌ సీఎం కావడానికి అన్ని విధాలా అర్హుడే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతలను కేటీఆర్ తన భుజాలపై వేసుకున్న సంగతి తెలిసిందే. దావోస్ పర్యటనకు వెళ్లినా సరే.. అక్కడి నుంచే ఎప్పటికప్పుడు సలహాలు,సూచనలు చేశారు. ఫలితాల్లో టీఆర్ఎస్ దుమ్ము రేపడంతో పార్టీ నేతలు ఆయనకే క్రెడిట్ ఇస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా మున్సిపల్ ఫలితాల తర్వాత కేటీఆర్‌ను మీడియా ముఖంగా ప్రత్యేకంగా అభినందించారు. ఏదేమైనా తాజా మున్సిపల్ ఎన్నికలు కేటీఆర్ అన్ని విధాలా సమర్థుడు అన్న సంకేతాలను మరోసారి జనంలోకి పంపించాయని చర్చించుకుంటున్నారు.

Related posts