telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విభజన చట్టంలోని హామీలకు బడ్జెట్లో ప్రతిపాదనలు లేవు: ఎంపీ ప్రభాకర్ రెడ్డి

Prabhakar Reddy mp

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పెదవి విరిచారు. విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క హామీకి బడ్జెట్లో ప్రతిపాదనలు లేవని మండిపడ్డారు. ఈ బడ్జెట్ వల్ల ఏ రాష్ట్రానికీ ఉపయోగం లేదని విమర్శించారు. ప్రజలకు మేలు చేసే ప్రకటనలు ఏమీ లేవని అన్నారు. ప్రతి ఇంటికి తాగు నీరు అందించేందుకు కేటాయింపులు చేయడం సంతోషకరమని అన్నారు.

ఇప్పటికే ఆ పథకాన్ని మిషన్ భగీరథ పేరుతో తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు. తమ పథకాన్నే పేరు మార్చి బడ్జెట్ లో పెట్టుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించిందని అన్నారు. టీఆర్ఎస్ మరో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, మిషన్ భగీరథకు ఆర్థికసాయం చేసి ఉంటే బాగుండేదని చెప్పారు. బంగారంపై సుంకాన్ని పెంచారని, దీని వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతారని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఈ బడ్జెట్ ఉందని నామా పేర్కొన్నారు.

Related posts