telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

కొత్త కేలండర్

madhumasam poetry corner

రంగుల బట్టలేసుకుని
మది నిండా ఆశలతో
కొత్తకోడలు వలె ఇంట్లో
అడుగు పెట్టీ పెట్టగానే
గొంతులోసూది దింపినా…
మేకుకి దారంతో ఉరి తీసినా…
విలవిలలాడక పోగా
రెపరెపలాడుతుంటాను

ఎవరో ఎక్కడో దూరమైతే
నల్లని సున్నా మధ్య
నను నిలబెడితే
మచ్చెక్కడ స్థిర పడుతుందో అని
పగలల్లా పొగిలి పొగిలి
నిశిరాత్రి మరోరోజు నట్టింట
నిశ్శబ్దంగా అడుగు పెడుతుంటాను

హత్యలూ మానభంగాలూ
దోపిడీలూ దొంగతనాలూ
వాదాలూ పిడివాదాలూ
మౌనంగా కంటూ …వింటూ
ముప్పదిరోజులు కళ్ళు మూసుకుని
మరో పేజీ తిరగేసుకుని
కామాయై వెళుతున్నానే తప్ప
కర్తవ్యానికి ఎక్కడా
పుల్ స్టాప్ పెట్టలేదు.

నను ఖండఖండాలుగా చీల్చినా
నా దేహపు భాగాలలో
కొన్నిటిని పొగుడుతూ
కొన్నిటిని తెగుడుతూ
మంచీ చెడులని పేరిడినా
కొత్త సంవత్సరం అని పిలవగానే
ముస్తాబై వస్తూనే ఉన్నాను

కాలం తీరాక
పుస్తకాలకు అట్టగానో
పేపరు చుట్టగానో
బజ్జీల ప్యాకెట్టుగానో
గతస్మృతుల కట్టగానో
మారిపోతునే ఉంటాను.
కడకు నేను కాలి
మీకు వేడినిస్తాను
వదిలేస్తే మట్టిని చేరి
మేటి మట్టిదిబ్బ ఔతాను.

నాలాగా
పరోపకారంలో
సేవా భావంతో
శ్రామిక జనం
కార్మిక వర్గం
కర్షక లోకం
పీడితుల నుండి తాడితుల వరకు
నాలాంటి అమూల్య
బడుగు బలహీనులెందరో
మార్కెట్‌లో పదిరూపాయలకే
అమ్ముడు పోతున్నారు,
ఆకలితో అలమటిస్తున్నారు.

వారి కన్నీటి చుక్కల్ని
సిరా చుక్కలుగా మార్చి
చెమట బొట్టుల్ని
విప్లవ బొబ్బలుగా కూర్చి
శ్రమ దోపిడీని అరికట్టే రోజు
దగ్గరలోనే ఉంది.
ఆ రోజు చుట్టూ
ఎర్ర ని సున్నా చుట్టుకుని
నీతో కలమెత్తుతా
వినూత్న కేలండరై మొలకెత్తుతా
విశ్వ నాదమై గళమెత్తుతా
కదలిరా నవ యువకా…
కలసిరా యువ గొంతుకా…

🙏 సైదులు అరేపల్లి🙏

Related posts