telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఎంపీ కోమ‌టిరెడ్డి లేఖ..

క‌లుషిత‌మైన మూసీ నదిని ప్ర‌క్షాళ‌న చేసేందుకు కేంద్రం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని కోరారు. ఈ మేర‌కు ప్ర‌ధాని కార్యాల‌యానికి లేఖ రాశారు. ఈ లేఖ‌లో హైద‌రాబాద్ ఖ్యాతి నిలువుట‌ద్ద‌మైన మూసీ న‌ది నేడు కాలుష్యం కోర‌ల్లో చిక్కుకుంద‌ని తెలిపారు. న‌గ‌రంలో ఒక‌ప్పుడు తాగునీరు, సాగునీరును ఇచ్చిన మూసీ న‌ది ఇప్పుడు వినియోగానికి ప‌నికిరాకుండా పోతున్నాయ‌ని వివ‌రించారు. కాలుష్యం బారిన‌ప‌డిన మూసీ న‌దిని ర‌క్షించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. మూసీ న‌ది నీటిని ప‌రివార ప్రాంతాల్లో వ్య‌వ‌సాయానికి.. అలాగే చాలా చోట్ల తాగేందుకు ఈ మూసీ నీటినే వినియోగిస్తున్నార‌ని లేఖ‌లో వివ‌రించారు. క‌లుషితమైన నీటి వ‌ల‌న మాన‌వ ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని తెలిపారు. ఈ నీటితో పండిన పంట‌లు తిన‌డం, ఆవుల‌కు ఈ నీటిని తాగించ‌డం ఆ ప‌దార్ధాల‌ను న‌గ‌ర‌వాసులు తిన‌డం వ‌ల్ల ల‌క్ష‌లాది మంది శ‌రీరాల్లో టాక్సిక్ అనే హ‌నిక‌ర‌మైన మిన‌ర‌ల్స్ పేరుకుపోతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మూసీ ప‌రిస‌ర ప్రాంతాల్లో 300 – 500 ఫీట్ల లోతు వ‌ర‌కు భూగ‌ర్భ జ‌లం క‌లుషిత‌మైంద‌న్నారు. భువ‌న‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని చౌటుప్ప‌ల్, పోచంప‌ల్లిలోని 40కి పైగా ఫార్మా కంపెనీలు హ‌నిక‌ర‌మైన టాక్సిక్, వ్య‌ర్ధ ప‌దార్ధాల‌ను న‌దిలోకి వ‌దులుతున్నార‌ని వివ‌రించారు. వీటి వ‌ల్ల సూర్యాపేట జిల్లావాసులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిపారు. ప్ర‌ధాని మోదీ స్పందించి జాతీయ న‌దుల ప‌రిర‌క్ష‌ణ ప‌థ‌కంలో భాగంగా న‌మామి గంగా మూసీ న‌దిని ప్ర‌క్షాళ‌న చేయాల‌ని లేఖ‌లో కోరారు. దీని వ‌ల్ల ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల ఆరోగ్యం కాపాడిన వారు అవుతార‌ని వివ‌రించారు.

Related posts