telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ : కలకత్తా .. ఉత్కంఠతో కూడిన .. గెలుపు..

ఐపీఎల్ లో భాగంగా అత్యంత రవసత్తరంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా 34 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్‌పై గెలిచింది. రసెల్‌తో పాటు శుభ్‌మన్‌ గిల్‌ (76; 45 బంతుల్లో 6×4, 4×6), క్రిస్‌ లిన్‌ (54; 29 బంతుల్లో 8×4, 2×6) రెచ్చిపోవడంతో మొదట కోల్‌కతా 2 వికెట్లకు 232 పరుగుల భారీ స్కోరు సాధించింది. హార్దిక్‌ పాండ్య అద్భుతంగా బ్యాటింగ్‌ చేసినా ముంబయికి ఓటమి తప్పలేదు. ఛేదనలో ముంబయి 7 వికెట్లకు 198 పరుగులు చేసింది. రసెల్‌ (2/25) బంతితోనూ గొప్పగా రాణించాడు. రసెల్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

ముంబై కొండంత లక్ష్యంతోటి, ఆపై 6.1 ఓవర్లలో 41 పరుగులకే మూడు వికెట్లు. డికాక్‌ (0), రోహిత్‌ (12), లూయిస్‌ (15) వెనుదిరిగారు. జట్టు స్కోరు 58 వద్ద సూర్యకుమార్‌ (26) కూడా ఔట‌య్యాడు. ముంబయి పరాజయం లాంఛనమే అనుకున్నారంతా! కానీ హార్దిక్‌ పాండ్య అనూహ్యంగా విరుచుకుపడ్డాడు. మ్యాచ్‌ చేతికొచ్చినట్లేనని భావించిన కోల్‌కతాకు కళ్లుచెదిరే షాట్లతో వణుకు పుట్టించాడు. మరోవైపు పొలార్డ్‌ (20; 21 బంతుల్లో 2×4) బ్యాటు ఝుళిపించలేకపోయినా.. హార్దిక్‌ సిక్స్‌లు, ఫోర్ల మోతతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా పియూష్‌ చావ్లా అతడి చేతిలో దారుణంగా దెబ్బతిన్నాడు. చావ్లా వేసిన ఇన్నింగ్స్‌ పదో ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన హార్దిక్‌… అతడి తర్వాతి ఓవర్లో మరో రెండు సిక్స్‌లు దంచాడు. పొలార్డ్‌ ఔటైనా అతడి జోరు తగ్గలేదు. గర్నీ, నరైన్‌లకూ చుక్కలు చూపించిన అతడు.. 17 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. అయినా సాధించాల్సిన రన్‌రేట్‌ చాలా ఎక్కువే ఉంది. చివరి 6 ఓవర్లలో విజయానికి ముంబయి 100 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అయినా.. హార్దిక్‌ జోరు కారణంగా కోల్‌కతా ధీమాగా ఉండలేని స్థితి. 15వ ఓవర్లో రసెల్‌ ఏడు పరుగులే ఇవ్వడంతో చివరి ఐదు ఓవర్లలో 93 పరుగులు అవసరమయ్యాయి. కృనాల్‌ ఓ సిక్స్‌, హార్దిక్‌ రెండు ఫోర్లు బాదడంతో చావ్లా బౌలింగ్‌లో ఏకంగా 20 పరుగులొచ్చాయి. జోరు కొనసాగించిన హార్దిక్‌.. నరైన్‌ బౌలింగ్‌లో ఓ సిక్స్‌, ఫోర్‌ కొట్టడంతో 17వ ఓవర్లో 14 పరుగులొచ్చాయి. చివరి 3 ఓవర్లలో 59 పరుగులు చేయాల్సివున్నా… ముంబయి అవకాశాల్ని పూర్తిగా కొట్టివేయలేని పరిస్థితి. కోల్‌కతాపై ఒత్తిడిని కొనసాగిస్తూ… గర్నీ వేసిన 18వ ఓవర్లో మూడు, నాలుగో బంతుల్లో వరుసగా 6, 4 దంచాడు హార్దిక్‌. ఐతే ఆఖరి బంతికి హార్దిక్‌ క్యాచ్‌ ఔట్‌ కావడంతో కోల్‌కతా ఊపిరిపీల్చుకుంది. పియూష్‌ చావ్లా 4 ఓవర్లలో 57 పరుగులిచ్చాడు.

ఆట ప్రారంభం నుండి కోల్‌కతా ఇన్నింగ్స్‌లో పరుగుల వరదే. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, క్రిస్‌ లిన్‌ విధ్వంసక ఆరంభాన్నిస్తే.. రసెల్‌ తనదైన శైలిలో కళ్లు చెదిరే ముగింపునిచ్చాడు. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ముంబయి చింతించేలా చేస్తూ గిల్‌, లిన్‌ విధ్వంసకాండకు దిగారు. బరిందర్‌ శరణ్‌ బౌలింగ్‌ దాడిని ఆరంభించగా.. శుభ్‌మన్‌ రెండు ఫోర్లు, సిక్స్‌తో స్వాగతం చెప్పాడు. తర్వాతి రెండు ఓవర్లలో ఐదే పరుగులొచ్చినా.. నాలుగో ఓవర్‌ నుంచి స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కృనాల్‌ బౌలింగ్‌లో లిన్‌ రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత కూడా లిన్‌, శుభ్‌మన్‌ ఎడాపెడా బౌండరీలు బాదేయడంతో 9 ఓవర్లలో 89/0తో నిలిచింది కోల్‌కతా. ఐతే పదో ఓవర్లో లిన్‌ను రాహుల్‌ చాహర్‌ వెనక్కి పంపగా.. భీకర ఫామ్‌లో ఉన్న రసెల్‌ను ఈసారి చాలా ముందే బ్యాటింగ్‌కు దించింది కోల్‌కతా. మరోవైపు శుభ్‌మన్‌ జోరు కొనసాగిస్తున్నా.. రసెల్‌ను కాసేపు కట్టడి చేయగలిగింది ముంబయి. తొలి 12 బంతుల్లో ఆరు పరుగులే చేసిన రసెల్‌.. రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టాక కూడా అతణ్ని కాస్త కట్టడి చేయగలిగింది. 23 బంతుల్లో అతడు చేసింది 30 పరుగులు. కానీ ఆఖరి మూడు ఓవర్లలో అతడి ఊచకోతను ఆపడం మాత్రం ముంబయి వల్ల కాలేదు. భీకరంగా విరుచుకుపడ్డ రసెల్‌.. హార్దిక్‌ బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు, బుమ్రా బౌలింగ్‌లో 4, 6… మలింగ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాది కోల్‌కతాకు అత్యంత భారీ స్కోరును అందించాడు. 16వ ఓవర్లో శుభ్‌మన్‌ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ (15 నాటౌట్‌; 7 బంతుల్లో 1×4, 1×6) కూడా ధాటిగానే ఆడాడు. చివరి నాలుగు ఓవర్లలో కోల్‌కతాకు 68 పరుగులొచ్చాయి.

kolkata won on mumbai in Ipl 2019 matchనేటి మ్యాచ్ : హైదరాబాద్ vs పంజాబ్ రాత్రి 8 గంటలకు జరుగనుంది.

Related posts