telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి.. కోడెల గురించి పలు విషయాలు!

kodela shivaprasad

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంటలో 1947 మే 2న కోడెల శివప్రసాదరావు జన్మించారు. ఎన్టీఆర్ పిలుపుతో చిన్న వయసులోనే వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చి, ఎన్నో పదవులను అలంకరించి, వాటికి వన్నె తెచ్చిన వ్యక్తి కోడెల. 1983 నుంచి 2004 వరకూ వరుసగా ఐదుసార్లు నరసరావు పేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల, ఆపై రెండు సార్లు ఓడిపోయి, 2014లో సత్తెనపల్లి నుంచి విజయం సాధించారు. 1997-99 మధ్యలో పంచాయతీరాజ్‌ శాఖమంత్రిగా కోడెల పనిచేశారు. 2014-19 వరకూ ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఆయన పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత నవ్యాంధ్రకు తొలి స్పీకర్ గా సేవలందించారు.

గుంటూరు జిల్లా నరసరావుపేటలో టెన్త్ వరకూ చదివిన ఆయన ఆపై, విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ వరకూ చదివారు. చిన్నతనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోయిన ఘటన కోడెల మనసులో చెరగని ముద్ర వేయగా, డాక్టర్ కావాలన్న ఆలోచన నాటుకుపోయింది.కర్నూలు వైద్య కళాశాలలో, ఆపై గుంటూరులో ఎంబీబీఎస్, వారణాసిలో ఎంఎస్ చేశారు. నరసరావుపేటలో ఆసుపత్రిని ప్రారంభించారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతున్న కోడెలపై ఎన్టీఆర్ దృష్టి పడింది. ఆయన ఆహ్వానం మేరకు, 1983లో టీడీపీలో చేరిన కోడెల రాజకీయాల్లో తనదైన శైలిలో ముద్రవేసుకున్నారు.

Related posts