telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఆరోపణలకు .. సాక్ష్యాలు చూపాలి.. : కోడెల

AP Assembly sessions January 30 Speaker Kodela

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు పెరిగాయన్న ఆయన.. టీడీపీ కార్యకర్తలు గ్రామాలు విడిచి పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రక్షణ కల్పించలేని స్థితిలో ఉన్నారని.. టీడీపీ కార్యకర్తలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. స్పీకర్‌గా తాను నిష్పక్షపాతంగా పనిచేశానని వెల్లడించారు. తన కుటుంబంలో తాను తప్ప ఎవరూ రాజకీయాల్లోకి రారని.. తన కుటుంబంపై అనేక కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. లేనిపోని కేసులు పెట్టాలంటూ విజయసాయిరెడ్డి రెచ్చగొడుతున్నారని.. తప్పుడు కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు.

అన్ని ఆరోపణలకు ఒక్క ఆధారమైనా చూపించాలని కోడెల సవాల్ విసిరారు. తమ ప్రభుత్వంలో ఇలాంటి వేధింపులు లేవని, విజయసాయి రెడ్డి ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. తన కుమార్తె ఫార్మా కంపెనీని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. కేసులపై న్యాయపోరాటం చేస్తానని.. అధికారం అడ్డుపెట్టుకొని వేధిస్తే చూస్తూ ఊరకోమని కోడెల అన్నారు. కాగా కోడెల కుటుంబంపై ఆయన నియోజకవర్గంలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నరసరావుపేట, సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లకు క్యూలు కడుతోన్న బాధితులు కోడెల కుటుంబ అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తోన్న విషయం తెలిసిందే.

Related posts