telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ వ్యాఖ్యలపై .. కోదండరాం విసుర్లు..

kodandaram protest on inter students suicide

హుజుర్ నగర్ గెలుపుతో కేసీఆర్ మీడియా సమావేశంలో ఆర్టీసీ కార్మికులను ఏకిపారేశారు. దీనిపై కోదండరాం స్పందిస్తూ.. ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి జర్నలిస్టులు అడిగిన చాలా ప్రశ్నలకు దబాయింపుకు పాల్పడ్డారు కానీ హేతుబద్దమైన సమాధానం ముఖ్యమంత్రి దగ్గర లేదనే విషయం అర్థమైందని ఎద్దేవా చేశారు. ఆదేశిక సూత్రాల ప్రకారం ప్రజలకు మెరుగైన జీవనం ఇవ్వాలి. దానికి ప్రభుత్వం బాధ్యత పడాలి అని మొన్న హైకోర్టు పధ్నాలుగు పేజీల ఆర్డర్ కాపీలో స్పష్టంగా చెప్పింది. మనది సోషలిస్టు దేశమని, ప్రజలందరూ గౌరవంగా బతికే పరిస్థితులు ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ కూడా స్పష్గంగా అన్నారు – పేదరిక నిర్మూలనలో ప్రజా రవాణా చాలా ప్రాముఖ్యం కలిగినది అని. పేద ప్రజల విద్య, వైద్య, ఉద్యోగ, రవాణా, ఆర్ధిక అవసరాలను తీర్చే ఆర్టీసీని లాభం-నష్టం భాషలో, పరిభాషలో చూడొద్దని కోదండరాం పేర్కొన్నారు. కార్మికులు సకలజనుల సమ్మె విజయవంతం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించారు. ఇప్పుడున్న గుర్తింపు సంఘం టీఎంయూ కూడా సమ్మెలో ఉంది అని కోదండరాం గుర్తు చేశారు. నాడు వీరే రాష్ట్రాన్ని సాధించడం ద్వారా కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేశారు. అవసరమైనపుడు కార్మికులను వాడుకుని ఇపుడు తీసిపారేయడం అన్యాయం. నష్టాలకు కార్మికులు కారణం అనడం దుర్మార్గం. టికెట్ల రేట్లను ప్రభుత్వం నియంత్రించినంత కాలం నష్టాలను ప్రభుత్వమే భరించాలి. నష్టాల విషయంలో ఆర్టీసీపై బాధ్యత పెట్టి, ప్రయివేటీ కరణ చేయడంలో మాత్రం కేబినేట్ కూడా అవసరం లేదు, నేను ఒక్క సంతకంతో ప్రైవేట్ చేసేస్తా అనడం దురహంకారం, రాజ్యంగ విరుద్ధం, అప్రజాస్వామికం అంటూ విరుచుకుపడ్డారు.

కేసీఆర్ గారు కార్మికులు మంచోళ్ళు కానీ యూనియన్లు చెడ్డవి అనడం హాస్యాస్పదమని కోదండరాం అన్నారు. కార్మికులు తయారు చేసుకున్నదే యూనియన్. వారి గొంతుక, వారి హక్కు అయిన సంఘాలను అప్రతిష్టపాలు చేయడం దుర్మార్గం. ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితిపై ప్రభుత్వం వెంటనే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. అభద్రతలో, ఆందోళనలో బతుకుతున్న 48 వేల కుటుంబాలను మరింత కృంగదీసేలా బెదిరింపులు చేయడం మాని, వెంటనే చర్చలకు పిలవాలి. ఈ దిశగా తీర్పు ఇచ్చిన కోర్టును, రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఆర్టీసీ నష్టాల సాకుతో ప్రయివేటికరణ చేయాలనుకోవడం నడువదు. ఈ ధోరణి మానుకోకపోతే ఆయనే నేటి ప్రెస్ మీట్ లో చెప్పినట్టు ప్రజలే ముఖ్యమంత్రిని తీసేస్తారు అని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులకు వారి కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తున్నాం… ఈ తాటాకు చప్పుళ్ళకు బెదరొద్దు, ఆవేదన చెందొద్దు, అఘాయిత్యాలకు పాల్పడొద్దు. విపక్షాలు అన్నీ మీతో ఉన్నాయి, దేశవ్యాప్త ప్రజాసంఘాలు, యూనియన్లు మీతో ఉన్నాయి. పోరాడుదాం, హక్కుల్ని సాధించుకుందాం అని పిలుపునిచ్చారు.

Related posts