telugu navyamedia
సినిమా వార్తలు

‘భీమ్లా నాయక్’లో టైటిల్ సాంగ్.. ‘కిన్నెర’ కళాకారుడు ఎవరంటే..!

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. నిన్న ఆయన పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. యూట్యూబ్‌లో ఈ పాటకు పది గంటల్లోనే 58 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ పాట పాడిన నల్లమల కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య పేరు ఇప్పుడు మార్మోగుతోంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మొగులయ్యకు సినిమాలో పాడే అవకాశం రావడంతో సంతోషం పట్టలేకపోతున్నాడు.

అంతరించిపోతున్న కిన్నెర వాయిద్య కళను కాపాడుతున్న మొగులయ్యను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఉగాది పురస్కారంతో గౌరవించింది. 8వ తరగతిలో మొగులయ్యపై ప్రత్యేకంగా ఓ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది. మొగులయ్య తెలంగాణ ప్రాంతానికి చెందిన జానపద గాయకుడు.. 12 మెట్లు కిన్నెర వాద్య కళాకారుడు. పాలమూరు జిల్లా అచ్చంపేట మండలం లింగాల గ్రామం ఆయన స్వస్థలం.

 

7 మెట్ల కిన్నెర వాయించే తన తండ్రి స్పూర్తితో.. సొరకాయ బుర్రలు – వెదురుబొంగుల సహాయంతో ’12 మెట్ల కిన్నెర’ ను తయారు చేశారు మొగులయ్య. ఏడు మెట్ల కిన్నెరను పన్నెండు మెట్లుగా మార్చి ప్రదర్శనలు ఇచ్చేవాడు. మొగులయ్య ప్రతిభ తెలిసిన పవన్ కల్యాణ్ తన చిత్రం కోసం పాట పాడించారు. ఈ పాటను తమిళనాడు అడవుల్లో మొగులయ్యపైనే చిత్రీకరించడం విశేషం.

Related posts