telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ సామాజిక

కేసీఆర్ రంజాన్ కానుకలు…. సిద్ధం.. 4.5 లక్షలు..

kcr ramzan gift to muslims

పేద ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా పంపిణీచేసేందుకు 4.50 లక్షల గిఫ్ట్ ప్యాకులను అధికార యంత్రాంగం సిద్ధంచేసింది. తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ద్వారా తయారైన దుస్తులు/బట్టలు/ వస్త్రం నాణ్యతను పరిశీలించాలని ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ నెల 18 నుంచి జిల్లాల్లో, 20 నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పంపిణీ ప్రారంభించి రాష్ట్రమంతటా మే 25 కల్లా పూర్తిచేయాలని నిర్ణయించారు. గిఫ్ట్‌ప్యాకులో ఒక చీర, సల్వార్ కమీజ్, కుర్తా పైజామా, ఒక బ్యాగు ఉంటాయి. ముస్లింలలో అత్యంత పేదవారిని గుర్తించి వీటిని అందజేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అన్ని మతాల ప్రధాన పండుగలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు చీరెలు, క్రిస్మస్ పండుగకు క్రైస్తవులకు దుస్తులు, రంజాన్ సందర్భంగా ముస్లింలకు గిఫ్ట్ ప్యాకులను పంపిణీ చేస్తున్నది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 500 మందికి చొప్పున ఒక్కో మసీదు ద్వారా ఎంపిక చేసిన 448 మసీదుల్లో మొత్తం 2.24 లక్షల గిఫ్ట్ ప్యాకులను పంపిణీ చేయనున్నారు. మిగిలిన జిల్లాల పరిధిలో ఎంపికచేసిన 367 మసీదులతోపాటు 17 రిజర్వ్ మసీదులను కలుపుకొని 384 మసీదుల్లో 1.92 లక్షల గిఫ్ట్ ప్యాకులను అందజేస్తారు. వీటితోపాటు మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 30 వేలకుపైగా గిఫ్ట్ ప్యాకులను రిజర్వ్‌లో ఉంచారు. పేద ముస్లింలు ఎవరికైనా గిఫ్ట్ ప్యాకులు అందనిపక్షంలో రిజర్వ్‌చేసిన వాటిలో నుంచి ఇవ్వనున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 832 మసీదుల్లో దాదాపు 4.50 లక్షల గిఫ్ట్ ప్యాకులు పంపిణీచేసేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.

ప్రతి మసీదులో రంజాన్ గిఫ్ట్ లబ్ధిదారుల ఎంపిక కోసం కమిటీని ఏర్పాటుచేశారు. ఆయా మసీదుల పరిధిలోని ముస్లింల స్థితిగతులను కమిటీ పరిశీలించి లబ్ధిదారులను ఎంపికచేస్తుంది. ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, పేదవారిని గుర్తించి గిఫ్ట్‌ప్యాకులను పంపిణీ చేస్తారు. ఇఫ్తార్ విందు కోసం మసీదుకు రూ.1 లక్ష ఏటా ప్రభుత్వం దావత్-ఏ-ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈసారి కూడా ఇఫ్తార్ విందులకు మసీదుకు రూ.1 లక్ష చొప్పున కేటాయించింది. ఈ నిధులను వక్ఫ్‌బోర్డు నుంచి నేరుగా మసీదు కమిటీ ఖాతాలోకి జ మచేస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.4.48 కోట్లు, జిల్లాల్లో ఇఫ్తార్ విందులకు కోట్లు కేటాయించారు. ఒక్కో మసీదులో 500 మందికి విందు ఏర్పాటుచేస్తున్నారు. మసీదులకు కేటాయించిన నిధుల నిర్వహణను ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తారు.

సీఎం కేసీఆర్ రంజాన్‌కు ముందే కానుకలు లబ్ధిదారులకు అందిస్తే, వారు ఆనందిస్తారని సూచించారు. ఈ మేరకు 15 రోజుల ముందే పంపిణీ పూర్తిచేస్తాం. అప్పుడే కొత్త బట్టలు ధరించి పండుగ జరుపుకోవడానికి వారికి అవకాశం ఉం టుంది. కానుకల పంపిణీపై ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. అర్హులైన పేదలు లబ్ధిదారుల జాబితాలో లేకున్నా రిజర్వ్‌లో ఉంచిన గిఫ్ట్ ప్యాకులను అందజేస్తాం. గిఫ్ట్ ప్యాకుల పంపిణీ, ఇఫ్తార్ విందు ఏర్పాటుపై సీఎం కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల చివరివారంలో ప్రభుత్వ అధికారిక ఇఫ్తార్ విందు ఉంటుంది. దానికోసం ఏర్పాట్లు చేస్తున్నాం.

Related posts