telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

భారీ ఉద్యోగాల కు .. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. మూడు లక్షల ఉద్యోగాలు…

telangana map

తెలంగాణలోని యువత కలలు పండేలా ఉద్యోగాల కల్పనకు కేసీఆర్ ప్రభుత్వం పచ్చ జండా ఊపింది. పబ్లిక్‌, ప్రైవేటు రంగంలో యువతకు అవకాశాలు కల్పించాలని ఈ మేరకు నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఇదే విషయాన్ని వెల్లడించారు. రానున్న నాలుగు సంవత్సరాలలో.. ఎలక్ట్రానిక్‌ పరిశ్రమద్వారా రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని, ఇందుకోసమే.. తెలంగాణకు మూడో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ)ని మంజూరు చేయాలని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్లు, న్యాయశాఖల మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌కు లేఖ రాశామని చెప్పారు. రాయదుర్గంలో ఇంటెల్‌ డిజైన్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ సెంటర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ రంగం ద్వారా 60 వేల ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇటీవలే ఎలక్ట్రానిక్‌ రంగంలో చైనాకు చెందిన స్కైవర్త్‌ కంపెనీ 50 ఎకరాల్లో ఎలక్ట్రానిక్‌ పారిశ్రామికవాడను ఏర్పాటుచేయాలని నిర్ణయించిందన్నారు.

తెలంగాణలో ప్రస్తుతం దేశంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్లు (ఈఎంసీ) రెండున్నాయని, మూడో ఈఎంసీ మంజూరు కోసం చేసిన విజ్ఞప్తికి కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. ఐటీ పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్‌లో అనుకూలమైన వాతావరణం ఉన్నదని పేర్కొన్నారు. ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, టాస్క్‌, రిచ్‌, టీహబ్‌, వీహబ్‌ లాంటివి ఎన్నో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్‌ ఐటీ రంగంలో సుస్థిరతను, అభివృద్ధిని సాధించిందని, ఇది కేవలం సర్వీస్‌ సెక్టార్‌కు మాత్రమే పరిమితంకాకుండా ప్రొడక్ట్‌ ఇన్నోవేషన్‌కు ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రస్తుతం ఇన్నోవేటివ్‌ రంగంపై దృష్టిపెట్టామన్నారు. గత రెండు క్వార్టర్స్‌లో ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును దాటామని ప్రకటించారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, ఉత్పత్తి సృజనాత్మకతలో హైదరాబాద్‌ అందరికీ గమ్యస్థానంగా మారిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. వచ్చే ఏప్రిల్‌ నాటికి టీ వర్క్స్‌ పూర్తవుతుందని తెలిపారు.

Related posts