• Home
  • వార్తలు
  • ఏపీలో  కేసీఆర్ ల‌క్ష్యం నెర‌వేరుతుందా…?
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

ఏపీలో  కేసీఆర్ ల‌క్ష్యం నెర‌వేరుతుందా…?

KCR Chandrabbau Discussion for Alliance
తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుత ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే తెలంగాణ‌లో ముంద‌స్తుగా జ‌ర‌గనున్న ఎన్నిక‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేయ‌బోతున్న సంకేతాలు వెలువ‌డుతున్నాయి. తెలంగాణ‌లో మహాకూట‌మిగా  కాంగ్రెస్, టీడీపీ క‌లిసి పోటీచేస్తాయ‌న్న వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి తిట్ల ప్ర‌సంగాల‌తో విశ్వ‌రూపం చూపిస్తున్న కేసీఆర్…ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే ఏపీ రాజ‌కీయాల‌ను ఓ కుదుపు కుదిపేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్ కు ముందు నిర్వ‌హించిన మూడు ప్ర‌జాఆశీర్వాద స‌భ‌ల్లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శ‌లు చేసిన కేసీఆర్…మ‌హాకూట‌మిలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీ అయిన‌ప్ప‌టికీ….తాను మాత్రం టీడీపీని, చంద్ర‌బాబునే ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధిగా భావిస్తాన‌ని స్ప‌ష్టంచేశారు. కేసీఆర్ ప్ర‌సంగాలే కాదు…అడుగుల‌న్నీ చంద్ర‌బాబు ల‌క్ష్యంగానే సాగుతున్నాయి. టీడీపీని తెలంగాణ‌లో ఒక్క‌సీటు కూడా గెల‌వ‌నీకుండా చేయ‌డం ఒక్క‌టే కేసీఆర్ ల‌క్ష్యం కాదు. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఆరునెల‌ల‌లోపు జ‌ర‌గ‌నున్న ఏపీ ఎన్నిక‌ల్లో  టీడీపీని ఓడించ‌డ‌మే ప్ర‌స్తుతం కేసీఆర్ జీవితాశ‌యం.
TTDP President Ramana Fire to KCR
ఇందుకోసం ఆయ‌న ఇప్ప‌టికే కార్యాచ‌ర‌ణ ప్రారంభించార‌ని, కేంద్రంలోని బీజేపీ డైరెక్ష‌న్ లో  వైసీపీ, జ‌న‌సేన‌ల‌ను ద‌గ్గ‌ర‌చేస్తున్నార‌ని వార్త‌లొస్తున్నాయి. కేసీఆర్, వైసీపీ,జ‌న‌సేన స్నేహంపై ఇప్ప‌టికే చంద్ర‌బాబు ప‌లు ఆరోప‌ణ‌లు కూడా చేశారు.  ప్ర‌ధాన‌మంత్రి మోడీ,బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా ఆదేశాల మేర‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను ఓడించ‌డానికి కేసీఆర్ వైసీపీ, జ‌న‌సేన‌తో క‌లిసి ప‌నిచేస్తున్నార‌ని చంద్ర‌బాబు బ‌హిరంగంగానే అనుమ‌నాలు వ్య‌క్తంచేస్తున్నారు. చంద్ర‌బాబును ఉద్దేశించి న‌ల్గొండ స‌భ‌లో కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌తో పాటు తాజాగా టీఆర్ ఎస్ నేత‌ల జోస్యాలు ఈ అనుమానాల‌ను బ‌ల‌ప‌రుస్తున్నాయి. ప్ర‌జా ఆశీర్వాద‌స‌భ‌లో  చంద్ర‌బాబును ఉద్దేశించి…మీ రాష్ట్రంలో 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి క‌దా…వాటి సంగ‌తి చూసుకో…మా రాష్ట్రంలో  అడుగుపెడితే..నీకు ఎలా బుద్ధిచెప్పాలో  నాకు తెలుసు అని  కేసీఆర్ చేసిన హెచ్చ‌రిక వెన‌క ఏపీలో వైసీపీ, జ‌న‌సేన‌ను క‌లిపే వ్యూహ‌ముంద‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. అలాగే టీఆర్ ఎస్ నేత‌లు కొంద‌రు ఈ సారి ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని ఇప్ప‌టినుంచే ప్ర‌చారం మొద‌లుపెట్టారు. ఈ సారి వైసీపీ తిరుగులేని విజ‌యం సాధిస్తుంద‌ని టీఆర్ ఎస్ నేత‌లు న‌మ్మ‌కంగా  చెబుతున్నారు. ఈ విష‌యం చంద్ర‌బాబుకు కూడా తెలుస‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో ఓడిపోతే అమ‌రావతిలో ఉండ‌కుండా హైద‌రాబాద్ కు తిరిగి వ‌చ్చి తెలంగాణ రాజ‌కీయాల్లో త‌ల‌దూర్చాల‌ని ఆయ‌న భావిస్తున్నార‌ని, అందుకోసం తెలంగాణ‌లో నాలుగైదు సీట్లు గెలుపొందేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని టీఆర్ ఎస్ నేత‌లు విశ్లేషిస్తున్నారు.
chandrababu
ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే….టీఆర్ఎస్ ఏపీ రాజ‌కీయాల్లో తెర‌వెన‌క కీల‌క‌ పాత్ర పోషించ‌నున్న‌ట్టు అర్ధ‌మ‌వుతోంది. తెలంగాణ‌లో మీరు ప్ర‌తిప‌క్షంతో క‌లిశారు కాబ‌ట్టి..ఏపీలో ప్ర‌తిప‌క్షంతో మేం క‌లుస్తాం అన్న‌ది కేసీఆర్ లెక్క కావొచ్చు.  తెలంగాణ‌లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోకుండా ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఎలా కూట‌మి క‌డుతున్నాయో, ఆంధ్రాలో కూడా అలాగే వైసీపీ, జ‌న‌సేన‌ల‌ను క‌ల‌పాల‌న్న‌ది కేసీఆర్, బీజేపీ వ్యూహం. అధికార టీడీపీపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్న జ‌న‌సేనాని… వైసీపీని, జ‌గ‌న్ ను మాత్రం ప‌న్నెత్తు మాట‌న‌క‌పోవ‌డం ఈ వ్యూహంలో భాగ‌మే. ఏపీలో వైసీపీ, జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి పోటీచేయ‌క‌పోయినా ర‌హ‌స్య అవ‌గాహ‌న మాత్రం కుదుర్చుకోనున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. తెలంగాణ‌లో టీడీపీ, ఏపీలో టీఆర్ ఎస్ చేస్తున్న రాజ‌కీయాల్లో ఇదే కీల‌క‌మైన తేడా.
prof kodandaram also joined in mahakutami
తెలంగాణ‌లో  కాంగ్రెస్ తో స్నేహాన్ని టీడీపీ బ‌హిరంగంగా ప్ర‌క‌టించి పొత్తు పెట్టుకుంటోంటే…తెలంగాణ‌కే ప‌రిమిత‌మైన పార్టీ కాబ‌ట్టి టీఆర్ ఎస్ వైసీపీతో ర‌హ‌స్య స్నేహం చేస్తోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న‌పెడితే అస‌లు తెర‌వెన‌క‌ వైసీపీ, జ‌న‌సేన‌, బీజేపీ, టీఆర్ ఎస్ ల మ‌ధ్య సాగుతోన్న ఈ స్నేహ‌బంధాన్ని ఏపీ ప్ర‌జ‌లు ఎలా అర్ధం చేసుకుంటున్నార‌న్న‌దే అస‌లైన ప్ర‌శ్న‌. విభ‌జ‌న బాధిత ఏపీకి ఇచ్చిన హామీల అమ‌లులో కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌ద‌ర్శిస్తోన్న నిర్ల‌క్ష్య వైఖ‌రి, నిధుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న సుదీర్ఘ‌పోరాటం, ఇటీవ‌ల ఏపీలో ఐటీ దాడులు, జ‌నసేన వైసీపీకి ద‌గ్గ‌ర‌వుతుండ‌డం, కేసీఆర్ చంద్ర‌బాబును అదే ప‌నిగా విమ‌ర్శ‌లు చేస్తుండ‌డం వంటివ‌న్నీ గ‌మ‌నిస్తున్న ఏపీ ప్ర‌జ‌లకు ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రిని చూస్తే ఎంతో సానుభూతి క‌లుగుతోంది.
Chandrababau, Bhuvaneshwari Tour Ananathapur
అంద‌రూ క‌లిసి చంద్ర‌బాబును ఒంట‌రిని చేశార‌న్న భావ‌న‌లో ఏపీ ప్ర‌జ‌లు ఉన్నారు. రాజ‌ధాని స‌హా స‌ర్వం కోల్పోయి దిక్కుతోచ‌క అల్లాడుతోన్న ఏపీని ఒక గాడిలో పెట్టేందుకు చంద్ర‌బాబు కృషి చేస్తోంటే రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్షాలు స్వీయ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల లెక్క‌ల్లో మునిగితేలుతూ కేంద్రంతో, కేసీఆర్ తో క‌లిసి న‌డ‌వ‌డం ప్ర‌జ‌ల‌కు రుచించ‌డం లేదు. చంద్ర‌బాబును తీవ్రంగా వ్య‌తిరేకించేవారు సైతం ఆయ‌న ముప్పేట దాడిని ఎదుర్కొంటూ ఒంట‌రిపోరాటం చేస్తున్నార‌ని అంగీక‌రిస్తున్నారు. బీజేపీ, కేసీఆర్, వైసీపీ, జ‌న‌సేన క‌లిసి త‌న‌ను ఒంట‌రిని చేశార‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డంలో చంద్ర‌బాబు స‌ఫ‌లీకృత‌మ‌య్యారు. ఇదే ఎన్నిక‌ల్లో టీడీపీకి లాభం క‌లిగించ‌నుంది. వైసీపీ, జ‌న‌సేన‌తో పాటు ఇత‌ర పార్టీలు క‌లిసి పోటీచేసిన‌ప్ప‌టికీ…ప్ర‌జ‌లు టీడీపీ వైపే మొగ్గుచూపే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. అలాగే టీడీపీకి లాభించే మ‌రో విష‌యం.. విభ‌జ‌న స‌మ‌యం నాటి ఆలోచ‌నావిధానం నుంచి ప్ర‌జ‌లు ఇంకా బ‌య‌ట‌కు రాక‌పోవ‌డ‌మే. చంద్ర‌బాబు విష‌యంలో ఏపీ ప్ర‌జ‌ల వైఖ‌రిలో పెద్దగా మార్పు రాలేదు.  ఏపీకి అనుభ‌వ‌జ్ఞుడైన చంద్ర‌బాబు అవ‌స‌రం అప్పుడు ఎంత ఉందో…ఇప్పుడూ అంతే ఉంద‌న్న‌ది ప్రజ‌ల అభిప్రాయం. అయితే ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌న్న‌దీ నిజ‌మే. నాలుగున్న‌రేళ్ల కాలంలో న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం ప్ర‌జ‌ల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా సాగ‌క‌పోవ‌డం, పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణ‌లో అమ‌ల‌యిన స్థాయిలో సంక్షేమ ప‌థ‌కాలు లేక‌పోవ‌డం, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు వంటివాటిపై  రాష్ట్రమంతా అసంతృప్తి ఉన్న‌ప్ప‌టికీ  ఇది మ‌రీ ప్ర‌భుత్వాన్ని కూల‌దోసే స్థాయిలో లేదు.
leninbabu appointed as ap cultural ambassador
మరో ఐదేళ్లు చంద్ర‌బాబు అధికారంలో ఉంటేనే ఏపీ గాడిన ప‌డుతుంద‌ని మెజార్టీ ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబును ఓడించ‌డానికి  బీజేపీ డైరెక్ష‌న్ లో కేసీఆర్  వైసీపీ, జ‌న‌సేనను క‌ల‌ప‌డంతో స‌హా ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా…అవేవీ ఫ‌లితాన్నిచ్చే అవ‌కాశం లేదు. రాజ‌కీయ ప‌రిశీల‌కులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తంచేస్తున్నారు. టీడీపీ గెలుపును అడ్డుకునే శ‌క్తి ప్ర‌స్తుతం ఎవ‌రికీ లేదని, మ‌హా అయితే గెలుపు ఆధిక్య‌త‌ను త‌గ్గించ‌గ‌ల‌గ‌డ‌మే ప్ర‌తిప‌క్షాలు చేయ‌గ‌లిగింద‌ని అంచనా వేస్తున్నారు. మ‌రి వ్య‌వ‌సాయానికి, పారిశ్రామికాభివృద్ధికి స‌మ ప్రాధాన్యం క‌ల్పిస్తూ న‌వ్యాంధ్ర రూప‌క‌ల్ప‌నకు శ‌క్తివంచ‌న లేకుండా కృషిచేస్తోన్న చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తారా…లేక కొత్త త‌ర‌హా పాల‌న కోసం వైసీపీ,  జ‌న‌సేన వెంట న‌డుస్తారా అన్నది కాల‌మే తేల్చ‌నుంది. 
 
-కమలాదేవి

Related posts

నంద్యాల సభలో జగన్

admin

అవిశ్వాసానికి బీజేపీ భయపడుతుంది: కాంగ్రెస్

admin

జన్మభూమిలో పాల్గొన్న బాబు…

admin

Leave a Comment