తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ తన కేబినెట్లోకి ఎవరెవరిని తీసుకోనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో తన మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ముహమూద్ అలీకి మాత్రమే కేసీఆర్ ఛాన్స్ ఇచ్చారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముహమూద్ అలీ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మంత్రులుగా ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఆసక్తిగా మారింది.
అయితే.. పలువురు కొత్త ముఖాలకు అవకాశం దక్కనుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రి పదవి కోసం ఎవరూ ప్రయత్నాలు చేసుకునే అవకాశం లేదని, సీఎం కేసీఆర్ ఎవరిని నిర్ణయిస్తే వారికే పదవి దక్కే అవకాశం ఉందని ఆపార్టీ నాయకులు చెబుతున్నారు. కేబినెట్లోకి మంత్రులను తీసుకునేందుకు మరికొంత సమయం పట్టనున్న నేపథ్యంలో ఆశావహులకు మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ ఎన్నికల్లో మంత్రులుగా కొనసాగి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి, అజ్మీరా చందులాల్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. వీరి స్థానంలో కొత్తవారు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే సమయంలో వివిధ సామాజిక వర్గాల కూర్పు, మహిళలను మంత్రులుగా తీసుకోవడం తదితర విషయాలు కేసీఆర్ ముందు సవాళ్లుగా నిలవనున్నాయి.
ఇక కొత్త మంత్రుల్లో ఎర్రబెల్లి దయాకర్రావు, డీఎస్ రెడ్యానాయక్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లతో పాటు దానం నాగేందర్, దాస్యం విజయ్ భాస్కర్ తదితరులకు స్థానం దక్కవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రుల విషయమై ఇంకా ఎటువంటి స్పష్టతా రాలేదు. తాజా మాజీ ఉప ముఖ్యమంత్రులుగా కడియం శ్రీహరి, మహమూద్ అలీ ఉండగా, వారి స్థానంలో అరూరి రమేశ్, మహ్మమ్మద్ ఫరీదుద్దీన్ లు రావచ్చన్న ప్రచారం జరుగుతోంది. టీ పద్మారావుగౌడ్ ప్లేస్ లో కేపీ వివేకానంద్ గౌడ్, జోగు రామన్న స్థానంలో దానం నాగేందర్ పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.