రాజకీయ వార్తలు

రాజకీయాల్లో మార్పు కోసమే ఫెడరల్ ఫ్రంట్ : కెసిఆర్

దేశంలో రాజకీయరంగంలో గుణాత్మకమైన మార్పు రావాలనే ఉద్దేశ్యంతోనే ఫెడరల్ ఫ్రంట్ కు శ్రీకారం చుట్టామని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు. సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో హైదరాబాద్ లో చర్చలు జరిపిన తరువాత చంద్రశేఖర్ రావు, అఖిలేష్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలని, అందుకే ఫెడరల్ ఫ్రంట్ ప్రారంభించి అందరి సహకారంతో మార్పులు కోసం ప్రయత్నం చేస్తున్నానని చంద్రశేఖర్ రావు తెలిపారు. చాలా కాలం నుంచి తాను అఖిలేష్ తో టచ్ లో ఉన్నానని చెప్పారు. ఫ్రంట్ గురించి అఖిలేష్ కు వివరిస్తూనే ఉన్నానని, ఫ్రంట్ గురించి ఎప్పటికప్పుడు జాతీయ నాయకులతో కలుస్తూనే ఉన్నానని, ఈరోజు హైదరాబాద్ కు వచ్చిన అఖిలేష్ తో విస్తృతంగా చర్చలు జరిపామని చెప్పారు. దేశ పాలనావ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావాలన్నదే తన ఉద్దేశ్యమని కెసిఆర్ చెప్పారు.

స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలవుతున్నా ప్రజలు ఆశించిన రీతిలో అభివృద్ధి జరగలేదని కెసిఆర్ అన్నారు. రైతులు, పేదలు, దళితులు, మైనార్టీలు ఎవరూ కూడా సంతృప్తిగా లేరని అన్నారు. పత్రికల వారు థర్డ్ ఫ్రంట్, ఆ ఫ్రంట్, ఈ ఫ్రంట్ అంటున్నారని, అలాంటివేమీ లేవని, దేశరాజకీయాల్లో సమూలమైన మార్పు కోసం జాతీయ నాయకులను ఒక త్రాటి మీదకు తీసుకొస్తున్నామని చెప్పారు. దేశంలో ఒక మార్పు కోసం, ఒక మంచి కోసం ప్రజలకు దశా, దిశా నిర్దేశించడం కోసం ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. దేశంలో ఆర్ధిక వికాసం ఆశించినంతగా లేదని, ఆ రకమైన ప్రయత్నాలు కూడా ప్రస్తుత ప్రభుత్వాలు చేయడం లేదని కెసిఆర్ చెప్పారు.

మన పక్కనున్న చైనా అభివృద్ధిలో దూసుకుపోతోందని, మనకంటే అన్నీ రంగాల్లో చైనా ముందుందని చెప్పారు. ప్రపంచంలోనే ఆర్థికంగా రెండవ దేశంగా ఉండడం విశేషమని ఆయన అన్నారు.

అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖర రావు ఊహించని విధంగా అభివృద్ధి చేశారని, ఆయన పథకాలు కూడా ఎంతో బాగున్నాయని, ఇప్పుడాయన దేశ రాజకీయ వ్యవస్థపై దృష్టి పెట్టడం ఆనందంగా ఉందని అన్నారు. దేశంలో కొత్త మార్పుకు కెసిఆర్ నడుం కట్టడం ఎంతో సముచితంగా ఉందని అన్నారు. రైతుల కోసం, పేదల కోసం పాటు పడతానని చెప్పడం తనకెంతో ఆనందంగా అన్పించిందని అన్నారు. ప్రస్తుతం దేశంలో తాగునీటి సమస్య భయంకరంగా ఉందని, దీనిమీద ప్రభుత్వం సరైన దృష్టి పెట్టడం లేదని, ప్రస్తుతమున్న కేంద్ర ప్రభుత్వం ప్రజలకెన్నో వాగ్దానాలు చేసిందని, ఆ వాగ్దానాలు అలాగే ఉన్నాయి తప్ప ఆచరణలోకి రాలేదని అఖిలేష్ అన్నారు.

ప్రస్తుతం దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఈ సమయంలో కెసిఆర్ లాంటి నాయకుడు నడుం కట్టడం ఆనందంగా ఉందని అన్నారు. ఆయనతో కలిసి పనిచేస్తానని, రాబోయే కాలంలో ప్రాంతీయ పార్టీలు బీజేపీని నిలువరిస్తాయనే నమ్మకం తనకుందని అఖిలేష్ అన్నారు.

Related posts

గ‌ద్ద‌రూ..వ‌ర్మా…నారాయ‌ణా…స‌మాజానికి ఏం చెబుతున్నారు…?

chandra sekkhar

విద్యార్థులతో రాహుల్ చర్చ..

admin

పవన్ కు శ్రీరెడ్డి వడ్డన… రహస్య సమావేశంపై జర్నలిస్ట్ మూర్తి సంచలనంగా…

vimala t

Leave a Comment