telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“90 ఎంఎల్” మా వ్యూ

90ml

బ్యాన‌ర్‌ : కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్‌
న‌టీన‌టులు : కార్తికేయ‌, నేహా సోలంకి, ర‌వికిష‌న్‌, రావు ర‌మేష్‌, అజయ్, ఆలీ , ప్ర‌గ‌తి త‌దిత‌రులు
రచన-దర్శకత్వం : శేఖర్ రెడ్డి ఎర్ర
సంగీతం : అనూప్ రూబెన్స్
కెమెరా : జె.యువ‌రాజ్‌
ఎడిటర్‌ : ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌
నిర్మాత : అశోక్‌రెడ్డి గుమ్మకొండ

ఒకవైపు హీరోగా మరోవైపు విలన్ గా తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న యంగ్ హీరో కార్తికేయ‌. ఆర్ఎక్స్ 100, హిప్పీ, గుణ‌ 369, గ్యాంగ్ లీడ‌ర్ వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు కార్తికేయ. అయితే ఆర్ఎక్స్ 100 తరువాత ఈ హీరో అంతటి హిట్ ను మళ్ళీ చూడలేదు. తాజాగా కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మాణంలో “90ఎం.ఎల్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం సెన్సార్ సమస్యలను అధిగమించి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రమైనా కార్తికేయకు మంచి హిట్ ను అందించిందేమో చూద్దాం.

కథ :
ఆల్కహాల్ సిండ్రోమ్ అనే వ్యాధితో పుడతాడు దేవదాస్ (కార్తికేయ). ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి రోజూ 3 పూటలా అతను మందు తాగాలి. లేదంటే అతని ప్రాణాలకే ప్రమాదం. అయితే దేవదాస్ కు ఉన్న ఈ సమస్య అందరికీ తెలియకపోవడంతో అతన్ని తాగుబోతుల చూస్తుంటారు. ఓ ప్రమాదం నుంచి పిల్లాడిని కాపాడే క్రమంలో దేవాకు సువాసన (నేహా సోలంకి) పరిచయం అవుతుంది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అయితే దేవదాస్ తనకున్న సమస్యను సువాసనా, ఆమె ఫ్యామిలీ దగ్గర దాచిపెడతాడు. ఎట్టకేలకు సువాసన కుటుంబానికి అతను తాగుబోతు అనే విషయం తెలిసిపోతుంది. దీంతో గొడవై సువాసన, దేవదాస్ మధ్య దూరం ఏర్పడుతుంది. అంతకుముందు దేవదాస్ తన ప్రేయసి కోసం కొందరితో విరోధం ఏర్పరుచుకుంటాడు. ఈ పరిస్థితులన్నీ ఎక్కడికి దారి తీశాయి ? దేవదాస్ కు ఉన్న సమస్య తీరిందా ? తన ప్రేమను దక్కించుకున్నాడా ? చివరకు ఏం జరిగింది ? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండి తెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
కార్తికేయ తాగుబోతుగా తన పాత్రలో మెప్పిస్తాడు. అయితే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో, డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఇక హీరోయిన్ నేహా సోలంకి తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. రావు రమేష్ రొటీన్ పాత్రలో కన్పించారు. మెయిన్ విలన్ రవికిషన్ తన నటనతో నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక సత్యప్రకాష్, ప్రభాకర్, అజయ్, అదుర్స్ రఘు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
తాగుబోతులు అసహ్యించుకునే ఈ సమాజంలో ఓ వ్యక్తి ఆల్కహాల్ సిండ్రోమ్ తో పుట్టి, పెరిగితే అతని పరిస్థితి ఎలా ఉంటుంది అనే పాయింట్ తో సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు శేఖర్ రెడ్డి. అయితే ఈ సినిమాకు హీరోయిజం లాంటి కమర్షియల్ అంశాలను జోడించడంతో సినిమా రొటీన్ గా అన్పిస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం పెద్దగా ఆకట్టుకోదు. యువ‌రాజ్ సినిమాటోగ్ర‌ఫీ ఫర్వాలేదన్పిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.

రేటింగ్ : 2/5

Related posts