telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

నటుడు కర్నాటి లక్ష్మీ నరసయ్య .. మృతి..

karnati lakshmi narasayya died

నటుడు కర్నాటి లక్ష్మీ నరసయ్య (95) మృతి చెందారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని పటమటలోని కుమార్తె ఇంటికి తరలించారు. కర్నాటి చివరి కోరిక మేరకు భౌతికకాయాన్ని పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి, కళ్లను గోరా ఐ బ్యాంక్‌కు అందజేశారు. ఖమ్మం జిల్లా మధిర తాలుకా దెందులూరులో రాజమ్మ, వెంకయ్య దంపతులకు 1926, అక్టోబర్ 5న లక్ష్మీ నరసయ్య జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా మధిరలోనే కొనసాగింది. కళాకారునిగా ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు దిక్కులా తిరిగి తన కళా ప్రతిభను చాటుకున్నారు. రష్యా, అమెరికా, లండన్, దుబాయ్ దేశాల్లో పర్యటించి తన కళోపాసనకు గౌరవాన్ని ఆపాదించుకున్నారు. స్వగ్రామంలోని నాటక సమాజంలో కనకతార, వరవిక్రయం నాటకాలలో బాల పాత్రలతో ప్రారంభమైన ఆయన నాట కళాప్రస్థానం క్రమక్రమంగా ఎదిగి కళాసుమంగా వికసించింది.

ఉపాధ్యాయునిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. అప్పటి నుంచి కళారాధన చేస్తూ కళలతోనే తన అభ్యుదయ భావాలను సమ్మిళితం చేసి ప్రజల్లో చైతన్యం కలిగించిన కళామనిషి కర్నాటి లక్ష్మీనరసయ్య. కర్నాటి లక్ష్మీ నరసయ్య 1945లో ప్రజానాట్య మండలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. ప్రజానాట్య మండలి సారథ్యంలో ముందడుగు, మా భూమి, నిజరూపాలు, చచ్చింది ఎవరు? జీతగాడు, గిత్తల బేరం, మానవుడు చిరంజీవి, ఓటు ఎవరికి, ఓటు నీకే తదితర నాటకాలలో పలు పాత్రలను పోషించారు. 1865లో ఆంధ్ర నాటక కళా సమితిని స్థాపించారు. తన కళా ప్రదన్శలతో ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ సమాజాన్ని సమదృష్టితో చూసే ఆయనకు 1983లో జరిగిన షష్టిపూర్తి ఉత్సవంలో ప్రజా నటుడు బిరుదు లభించింది. ఆంధ్ర ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో తుఫాన్, జీవితపథం, ఈనాడు, గాలి మేడలు, ప్రగతి, మావూరు, అల్లిముఠా, శిక్ష, చైర్మన్, అల్లూరి సీతారామరాజు, ఆసామి, కన్యాశుల్కం, ప్రెసిడెంట్ పట్టయ్య వంటి అనేక నాటకాల్లో నటునిగా కీర్తి గడించారు.

భలే బావ, లవ్ మ్యారేజ్, పూలపల్లకి, ఈ చదువులు మాకొద్దు, ఈ చరిత్ర ఏ సీరాతో, ఇది కాదు ముగింపు, పుట్టిల్లు, అగ్గిరాముడు, నీడ వంటి అనేక సినిమాల్లో నటించినప్పటికీ ప్రజల హృదయాల్లో ప్రజా నటుడిగానే సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆకాశవాణి నాటకాల్లో ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలు పోషించారు. శ్రీపాద పరిషత్ పురస్కారాన్ని కర్నాటి లక్ష్మీ నరసయ్య అందుకున్నారు. 1987-90 సమయంలో తెలుగు విశ్వవిద్యాలయం జానపద కళల బోధనా మండలి సభ్యులుగా వ్యవహరించారు. విదేశాల్లోనూ కర్నాటి ఘన సత్కారాలను పొందారు. 1979లో సోవియెట్ యూనియన్ పర్యటించిన ఆయన 1995లో తానా ఆహ్వానంతో తెలుగు సభలకు అమెరికా వెళ్లి సత్కారం పొందారు. 1991లో నటప్రస్తాన స్వర్ణోత్సవాన్ని జరుపుకున్నారు. 1995లో కళాకారుల సమాఖ్యని స్థాపించారు. గత ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం, కందుకూరి విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ నుంచి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.

Related posts