telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కర్ణాటక, మహారాష్ట్రల మధ్య మళ్ళీ సరిహద్దు వివాదం…

కర్ణాటకలో ఉన్న బెళగావి.. తదితర ప్రాంతాలను తిరిగి సాధిస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే కార్యాలయం ట్వీట్‌ చేసింది. ఈ ప్రకటనపై కర్ణాటక సీఎం యడియూరప్ప సీరియస్ అయ్యారు. తమ రాష్ట్రంలోని అంగుళం భూమిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యలను ఖండిస్తూ యడియూరప్ప ట్వీట్ చేశారు. సరిహద్దు అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదన్నారు కర్ణాటక సీఎం. కర్ణాటకలో మహారాష్ట్రీయులు.. కన్నడిగులు సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తున్నారన్నారు. ఠాక్రే ప్రభుత్వం వ్యాఖ్యలు ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయన్నారు యడ్డీ. ఒకప్పుడు బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న బెళగావి.. తదితర ప్రాంతాలు ఆ తర్వాత మైసూరు రాష్ట్రంలో కలిశాయి. అక్కడ ఎక్కువ మంది ప్రజలు మరాఠీనే మాట్లాడతారు. కాబట్టి వాటిని తమ రాష్ట్రంలో కలపాలంటూ మహారాష్ట్ర డిమాండ్‌ చేస్తోంది. దీనిపై బెళగావి కేంద్రంగా 1948లో ఏర్పడిన మహారాష్ట్ర ఏకీకరణ సమితి పోరాటం కొనసాగిస్తోంది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు… అదే ఏడాది జనవరి 17న ఆ ప్రాంతాలను కర్ణాటకలో కలిపారు. దీనికి వ్యతిరేకంగా మహారాష్ట్ర ఏకీకరణ సమితి ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనల్లో సమితికి చెందిన 10 మంది అప్పట్లో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ సంస్థ ఏటా జనవరి 17న అమర వీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కార్యాలయం ట్విట్టర్‌లో సంచలన ప్రకటన చేసింది. కర్ణాటక ఆక్రమించిన మరాఠీ ప్రాంతాలను తిరిగి మహారాష్ట్రలో కలపడమే సరిహద్దు యుద్ధ అమరవీరులకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొంది.

Related posts