telugu navyamedia
రాజకీయ వార్తలు

నేటి నుంచి కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ!

karnataka-assembly

కర్ణాటక రాజకీయం రోజు రోజుకు మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర రాజకీయ భవిష్యత్ ఈ సమావేశాల్లో కీలక మలుపు తిరుగుతుందని భావిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు, స్వతంత్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారడంతో కర్ణాటక ప్రభుత్వం సంక్షోభంలో పడిన క్రమంలో కుమారస్వామి విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తే, ప్రభుత్వం రద్దయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికే పలువురు కాంగ్రెస్, జనతాదళ్ సెక్యులర్ ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు సమర్పించి, వాటిని ఆమోదించాలని సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. రెబల్స్ గా మారిన ఎమ్మెల్యేలంతా ముంబైలో మకాం వేయగా వారిని బుజ్జగించినా ఫలితం లేకపోయింది. రాష్ట్రంలో అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఉద్దేశంలో ఉన్న బీజేపీయే ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

 కర్ణాటక అసెంబ్లీ మొత్తం 225 స్థానాలు. 79 మంది సభ్యులున్న కాంగ్రెస్, 37 మంది సభ్యులున్న జేడీ (ఎస్)తో పాటు ఒక బీఎస్పీ సభ్యుడు ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు. వీరి బలం 117 కాగా, విపక్షంలోని బీజేపీకి 107 మంది సభ్యుల బలముంది. మరో స్వతంత్ర సభ్యుడు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే, ఆ వెంటనే ప్రభుత్వం పడిపోయే అవకాశముంది.

Related posts