telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరీంనగర్ : .. పండగనాడు .. ప్రారంభం కానున్న ఐటీ టవర్..

karimnagar IT tower will start on 8th october

జిల్లాలో నిర్మించిన ఐటీ టవర్‌ను అక్టోబర్ 8వ తేదీన దసరారోజు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటికే జీ ప్లస్ 5 పద్ధతిలో చేపడుతున్న ఈ నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయనీ, మిగిలిన పనులను కూడా దసరా నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణ స్టేట్ ఇండిస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) ఎండీ నర్సింహారెడ్డితో కలిసి ఆయన ఐటీ టవర్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఈ టవర్‌లో స్థానిక యువతకు 3 వేల నుంచి 4 వేల ఉద్యోగావకాశాలు రానున్నాయని తెలిపారు. ఇప్పటికే 11 కంపెనీలు ఎంఓయూ కుదర్చుకున్నాయనీ, వీటితోపాటు మర్ని కూడా ఇక్కడకు రానున్నాయని పేర్కొన్నారు. అనుకున్న సమయంలోనే ఈ టవర్ నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నామని వివరించారు. ఇక్కడ చదువుకున్న యువతకు స్థానికంగా ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ కరీంనగర్‌కు ఐటీ టవర్ మంజూరు చేశారని చెప్పారు.

దానికి అనుగుణంగా నిర్మాణాన్ని కూడా సకాలంలోనే పూర్తి చేసి, ప్రారంభోత్సవం చేస్తున్నామన్నారు. టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ అనంతరం కరీంనగర్‌లోని ఐటీ టవర్ పెద్దదని తెలిపారు. ఇక్కడ 65 వేల ఎస్‌ఎఫ్‌టీ అందుబాటులో ఉందన్నారు. ఇంక్యుబేషన్ చేసేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ఇక్కడ కంపెనీలు పెట్టే వారికి ప్రభుత్వం నుంచి అనేక ప్రోత్సాహకాలు అందుతాయని ప్రకటించారు. ఐటీ కంపెనీల నుంచి వచ్చే డిమాండ్ మేరకు మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలొ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, నాయకులు స్వామి, శ్రీకాంత్, సంపత్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Related posts