telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

కరిమబ్బు దెబ్బలు

farmers lost due to rains for two days

సుడులనీనుతున్న కడలి
ఆకాసానికి మేఘమై ఎగిరి
మా మునివ్రేళ్ళను తుడిచి పెట్టడం
నోటిలో నానాల్సిన గింజలు
నీటిలో నానడం…మా దురదృష్టం!

పొట్టలు మాడ్చుకొని మేము
పొట్టలు తడిచిన వరికంకులు
ఏకకాలం రెండు హత్యలు చేసింది
ఈ నీటికత్తి…
ఎరువు బస్తాలలో రుణాలను
కలిపి ఈ పచ్చని చేను
మొదళ్ళనోట్లోపోసాము
విత్తనాలన్నీ వడ్డీ విత్తం
తోకలిపి మా మునివ్రెళ్ళు భూమిని
ముద్దాడుతుంటే
నారును నేలతల్లి చీరచెంగుగా మలిచాం
కొంగు బంగారము నీటి కొరల్లో చిక్కింది
కాకిబంగారమయ్యింది
ధాన్యపుగింజ ముఖం

కరిమబ్బులో కరిమూకలు నేలకుదిగి
చేలను నేలమట్టం చేయడం…దారుణంకదా!
ఆరుగాలం కష్టపడ్డ మాకు
..ఋతుపవనాలు
చేస్తున్న దాష్టికం…అతివృష్టిచేసిన వీరంగం
వరికే కాదు రైతుకు వెన్నువిరగడం..
దురదృష్టమందామా!….ప్రకృతి మనకు
విసిరిన సవాల్ అందామా!!
ఏమైనా మమ్మల్ని ఆదుకోవడం
మీ అందరిబాధ్యత….
లేకుంటే ….
మీ అన్నకోశాలు తిరగబడి
మీచే ధర్నాలో,హర్తాళ్ళో…చేయిస్తాయి సుమా!
కానీ అప్పటికే మేము
వార్తల్లో పతాకశీర్షికలై..రాలుతాం కదా
ఉరితాడును వ్రేలాడుతూ…..
*************
కిలపర్తి దాలినాయుడు

Related posts