telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

లంచం ఇస్తేనే .. కల్యాణ లక్ష్మీ.. అధికారి డిమాండ్.. సస్పెండ్..

huge job notification in telanganaf

ప్రభుత్వ అధికారుల కక్కుర్తి పథకాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. అయితే నేటి వివిధ మాద్యమాలతో వీరి చేష్టలను బహిర్గతం చేసే అవకాశాలు ఉన్నాయి. తాజాగా, కల్యాణలక్ష్మి చెక్కును ఇచ్చేందుకు డబ్బులు కావాలంటూ డిమాండ్ చేసిన వ్యవహారంలో షేక్‌పేట మండల కార్యాలయంలో పని చేస్తున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కల్యాణలక్ష్మి చెక్కులను నేరుగా లబ్ధిదారుల కు ఇవ్వకుండా తన వద్ద పెట్టుకోవడంతో పాటు మధ్యవర్తుల సాయంతో డబ్బులు దండుకునేందుకు యత్నించినట్లు ఫిర్యాదులు రావడంతో ప్రాథమిక విచారణ చేపిట్టిన షేక్‌పేట మండల తహసీల్దార్ వెంకటరెడ్డి నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ కన్నన్ మాణిక్యరాజ్ ఈ మేరకు షేక్‌పేట మండలంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వంశీని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. బంజారాహిల్స్ రోడ్ నం 10లోని ఉదయ్‌నగ్‌లో నివాసం ఉంటున్న జి.రమ్య అనే యువతికి గత యేడాది మే 6న వివాహం జరిగింది. ఈ మేరకు గత యేడాది అగస్టులో ఆమె కుటుంబ సభ్యులు కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల కల్యాణలక్ష్మి చెక్కు మంజూరయిందంటూ షేక్‌పేట మండల కార్యాలయం నుంచి రమ్య సోదరుడు రాజ్‌కుమార్‌కు ఫోన్ వచ్చింది. దాని తో గత బుధవారం షేక్‌పేట మండల కార్యాలయానికి వెళ్లిన రమ్యతో సంతకాలు తీసుకున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వంశీ రెండురోజుల్లో బ్యాంకులో డిపాజిట్ చేస్తామంటూ చెప్పాడు. తిరిగి రెండు రోజుల తర్వాత చెక్కును తీసుకువెళ్లేందుకు వచ్చిన రాజ్‌కుమార్‌కు చెక్కు ఇవ్వకపోగా కొంత దురుసుగా మాట్లాడిన వంశీ మార్చి 23 తర్వాత చెక్కు వస్తుందని పంపించాడు.

టీడీపీ నేత బాలజీ గోస్వామికి ఈ విషయాన్ని గురించి చెప్పగా డబ్బులు ఇస్తే చెక్కు ఇవ్వొచ్చని, తాను మాట్లాడి చెక్కును ఇప్పిస్తానని చెప్పాడు. ఇదే విషయాన్ని గురించి రాజ్‌కుమార్ వెళ్లి షేక్‌పేట మండల తహసీల్దార్ వెంకట్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. దాంతో ఈ విషయంపై విచారణ చేపట్టగా మొత్తం 22 చెక్కులు మంజూరు కాగా 3 చెక్కులను మాత్రమే ఆయా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లో జమ చేసినట్లు తేలింది. మిగిలిన చెక్కులను తన వద్దే ఉంచుకోవడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన తహసీల్దార్ వెంకట్‌రెడ్డి ఈ మేరకు నివేదికను తయారు చేసి జిల్లా కలెక్టర్‌కు పంపించారు. దానిప్రకారం ఆర్‌ఐ వంశీని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎప్పటికప్పుడు లబ్ధిదారుల అకౌంట్లలో వేయాలని, ఎలాంటి అవకతవకలకు పాల్పడ్డా కఠినచర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా షేక్‌పేట మండల కార్యాలయం లో వివిధ పనుల నిమిత్తం వచ్చే లబ్ధిదారులకు సాయం చేస్తాననే నెపంతో రెవెన్యూ సిబ్బందికి మధ్యవర్తిగా పనిచేస్తూ జనాన్ని మోసం చేస్తున్నాడంటూ బాలాజీ గోస్వామిపై తహసీల్దార్ వెంకట్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts