telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“లక్ష్మీస్ ఎన్టీఆర్”పై కళ్యాణ్ రామ్ కామెంట్

Kalyan-Ram

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఎన్టీఆర్ బయోపిక్” త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ లో నందమూరి హరికృష్ణ పాత్ర పోషిస్తున్న ఆయన తనయుడు కళ్యాణ్ రామ్ మీడియాతో మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్ ఎందుకు లేడనే విషయాన్నీ బయటపెట్టారు కళ్యాణ్ రామ్.

తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్… తాతయ్య బయోపిక్ లో ఏ పాత్ర ఇచ్చినా చేసేవాడని… అది ఎలాంటి పాత్ర అయినా నందమూరి అభిమానులు ఎన్టీఆర్ కు ఇలాంటి పాత్ర ఇచ్చారా ? అని అసంతృప్తిని వ్యక్తం చేసేవారని తెలిపారు. అందుకే ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించలేదని స్పష్టం చేశారు. బాలకృష్ణ ఈ సినిమా ఆడియో వేడుకకు తారక్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి, అతని చేతుల మీదుగానే ఆడియోను విడుదల చేయించి ఎంతో గౌరవం ఇచ్చారని, అంతకన్నా ఇంకేం కావాలంటూ ప్రశ్నించారు. తాను చిన్నప్పుడు పైలట్ ను కావాలని అనుకునే వాడినని, కానీ బాబాయ్ సినిమాలు చూసి సినిమా రంగంవైపు మనసు మళ్లిందని చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్.

ఇక “లక్ష్మీస్ ఎన్టీఆర్” గురించి ప్రశ్నించగా “అలాంటి సినిమాల గురించి మాట్లాడకుండా ఉండడమే మంచిది” అంటూ సమాధానమిచ్చారు కళ్యాణ్ రామ్. “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాను “ఎన్టీఆర్ బయోపిక్”కు పోటీగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు వర్మ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి “వెన్నుపోటు” పాటను విడుదల చేసి సినిమాకు ఇప్పటినుంచే కావాల్సినంత ప్రచారం చేయడం మొదలుపెట్టాడు.

Related posts