telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“కల్కి” మా వ్యూ

kalki movie first look

బ్యానర్ : హ్యాపీ మూవీస్
న‌టీన‌టులు: రాజ‌శేఖ‌ర్‌, అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ తదితరులు
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
ఎడిటర్: గౌతమ్ నెరుసు
నిర్మాత: సి.కళ్యాణ్

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు పెట్టింది పేరు రాజశేఖర్. గత కొంతకాలంగా వరుస పరాజయాలను చవి చూస్తున్న రాజశేఖర్ కు “గరుడవేగ” చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు రాజశేఖర్. తాజాగా మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా “కల్కి” చిత్రంతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ అయ్యేలా చేసిందా ? రాజశేఖర్ కు మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందా ? అనేది చూద్దాము.

కథ :
1980లో… స్వ‌తంత్ర‌భార‌తంలో సంస్థానాలు విలీనం అవుతున్న సమయం… కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే న‌ర‌స‌ప్ప… కొల్లాపూరు నుంచి న‌ల్ల‌మ‌ల వ‌ర‌కు ఏం జరిగినా అంతా న‌ర్స‌ప్ప క‌నుస‌న్న‌ల్లో జ‌రుగుతుంటుంది. అక్క‌డి పొలం మీద దున్నేవాడికి హ‌క్కుండ‌దు. భార్య‌ల మీద హ‌క్కుండ‌దు. పెరుమాండ్లు (శ‌త్రు)తో క‌లిసి ఎమ్మెల్యే న‌ర‌స‌ప్ప (అశుతోష్‌ రాణా) ఎన్నో అరాచ‌కాలకు పాల్పడుతుంటాడు. ఊళ్ళో జనాలకు వాళ్ళంటేనే భయం. ఆ సమయంలో నర్సప్ప తమ్ముడు శేఖర్ బాబు (సిద్ధు జొన్నల‌గ‌డ్డ‌) ఊళ్ళో మంచి పనులు చేస్తూ మంచివాడిగా పేరు తెచ్చుకుంటాడు. హఠాత్తుగా శేఖర్ బాబు హత్యకు గురవుతాడు. అతన్ని ఊళ్లో చెట్టుకి వేలాడ‌దీసి కాల్చేస్తారు. ఈ హత్య పెరుమాండ్లు చేశారని భావిస్తారు నర్సప్ప వర్గం. అత‌ని హ‌త్య కేసుని ప‌రిశోధించ‌డానికి ఐపీఎస్ అధికారి, ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్టు క‌ల్కి (రాజ‌శేఖ‌ర్)ని నియమిస్తారు అధికారులు. ఊళ్లోకి అడుగుపెట్టిన కల్కికి తెలిసిన నిజాలు ఏంటి ? శేఖర్ బాబును ఎవరు చంపారు ? అసలు ఈ హత్యను కల్కి ఛేదించగలిగాడా ? న‌వ‌భార‌త్ పాత్రికేయుడు దేవ‌ద‌త్తా (రాహుల్ రామ‌కృష్ణ) ఇన్వెస్టిగేషన్ లో తేలిందేంటి ? ఈ ఇన్వెస్టిగేషన్ లో కల్కికి ఎదురైన అడ్డంకులేంటి ? అనే విషయాలు తెలియాలంటే సినేమాను వెండి తెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు పెట్టింది పేరు రాజశేఖర్. క‌ల్కి చిత్రంలో కూడా ఆయన పాత్ర పోలీస్ ఆఫీసరే. అయితే సినిమాలో రాజశేఖర్ లుక్ బాగుంది. సినిమాలో ఆయన స్టైల్ ఆకట్టుకుంటుంది. రాహుల్ రామ‌కృష్ణ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది. ఆయ‌న యాస‌, న‌ట‌న‌ ప్రేక్షకులను నవ్విస్తుంది. అదాశ‌ర్మ వైద్యురాలిగా అందంగా క‌నిపించింది. నందితా శ్వేత పాత్ర క‌థ‌లో కీల‌కం. కానీ కొన్ని స‌న్నివేశాల్లోనే ఆమె క‌నిపిస్తుంది. అశుతోష్ రాణా, శ‌త్రులు విలన్లుగా ఆకట్టుకుంటారు. సిద్ధు జొన్నలగడ్డ పాత్ర‌, ఆయ‌న అభిన‌యం మెప్పిస్తాయి. చ‌ర‌ణ్‌దీప్‌, నాజ‌ర్‌, పూజిత పొన్నాడ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు ఆక‌ట్టుకుంటారు నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
అ! లాంటి తొలి చిత్రంతోనే సరికొత్త ప్రయోగం చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ “కల్కి”తో రొటీన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కథను తెరపై చూపించాడు. కొన్ని సన్నివేశాలు సాగతీసిన అనుభూతి కలుగుతుంది. కొన్ని సన్నివేశాలకు లాజిక్‌ ఉండదు. ప్రేక్షకులకు థ్రిల్ కలిగించడంలో దర్శకుడు తడబడ్డాడు. శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతం, దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఈ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. నేపథ్య సంగీతం, పాటలు ఫరవాలేదన్పించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ : 2.5/5

Related posts