telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

కేసీఆర్ .. మంత్రివర్గ విస్తరణ.. పిటాయింపులకే పదవులు..

TRS Release Lok Sabha Candidates List

సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారనే వార్త ప్రస్తుతం తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. వాస్తవంగా గతేడాది డిసెంబర్‌లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండోసారి గెలిచినప్పుడే కేబినెట్‌లో బెర్త్‌ల విషయంలో చాలా సంచలనాలు ఉంటాయని అందరూ అనుకున్నారు. కేసీఆర్ చాలా వరకు రిస్క్ లేకుండా ఉండేలా కొందరు సీనియర్ మంత్రులు ఓడిపోయారు.

ఇప్పటివరకు మంత్రివర్గంలో 11 మందికి ఛాన్స్‌ దక్కగా మలిదశ విస్తరణలో చోటు దక్కించుకోవడానికి ఆశావాహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మిగిలింది ఆరు కేబినెట్ బెర్తులే కావడంతో ఆశావాహుల సంఖ్య చాంతాండంత ఉంది. ఇక ఆశావాహుల లిస్టులో పాత జిల్లాల నుంచి చూస్తే నల్గొండలో గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆశతో ఉన్నారు. ఇప్పటికే రెడ్డి వర్గం నుంచి ఏకంగా ఐదుగురు మంత్రులు ఉన్నారు. ఇక ఆరు ఖాళీల్లో రెండు బెర్త్‌లు మహిళలకు ఇస్తారంటున్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ సైతం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణలు,సీనియారిటీ ఆధారంగా కేబినెట్‌లో చోటు కల్పించనున్నారు గులాబీ బాస్.

తెలంగాణలో కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 13 మంది కారెక్కుతున్నట్టు ప్రకటించారు. త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో ఈ జంపింగ్ జాబితాలో కనీసం ఇద్దరికి మంత్రి పదవులు ఖాయం అంటున్నారు. వీరిలో మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కేబినెట్‌లో సబిత హోం మంత్రిగా ఉంటే… గండ్ర చీఫ్ విప్‌గా ఉన్నారు. ఇక జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో అధికారిక కార్యక్రమాల కోసం కీలక పదవుల్లో ఉన్న వారికే బాధ్యతలు ఇస్తున్నారు. అప్పటికే మంత్రి వర్గంతో పాటు ఇతర నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేస్తారట.

కేసీఆర్ కేబినెట్‌లో చోటు కోసం ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రేసులో ఉన్నారు. అయితే కేసీఆర్ వీరికి కాకుండా సత్తుపల్లి నుంచి వరుసగా మూడుసార్లు గెలవడంతో పాటు హ్యాట్రిక్ కొట్టిన సండ్ర వెంకట వీరయ్య వైపే మొగ్గు చూపుతున్నట్టు భోగట్టా. ఎస్సీ సామాజికవర్గం కోటాలో సండ్రకే ఛాన్స్ ఉంది. ఇక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం సండ్ర వైపే మొగ్గు చూపడంతో కేసీఆర్ ఆయనకే కేబినెట్‌లో చోటు కల్పిస్తారని తెలుస్తోంది. తాజా విస్తరణలో కేటీఆర్‌, హరీష్‌రావులకు ఏయే శాఖలు ఇస్తారు ? వీరి పరిస్థితి ఏంటన్నది కూడా ? ఆసక్తిగానే ఉంది.

Related posts