telugu navyamedia
సినిమా వార్తలు

అంబానీ జియో ఫైబర్ ప్రకటన… మల్టిఫ్లెక్స్ యాజమాన్యాలలో అలజడి

Mukesh ambani,PSL

రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఫైబర్ సేవలను సెప్టెంబర్ 5న తీసుకొస్తామని ముఖేష్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపై సినిమా విడుదలైన తొలిరోజునే ప్రేక్షకుడు ఇంట్లో కూర్చునే టీవీలో సినిమాను చూడొచ్చునని ఈ సందర్భంగా ప్రకటించారు. 2020 నుండి జియో సెట్ అప్ బాక్స్ ద్వారా ఈ అవకాశం అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఇది సాధారణంగా వినియోగదారులకు ఆనందాన్ని కలిగించే విషయమే. అయితే ఇది సినిమా రంగంపై ప్రభావం చూపుతుందనే దిశగా పలు అనుమానాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

“విశ్వరూపం” సమయంలో డి.టి.హెచ్‌లో సినిమాను డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తానని కమల్‌హాసన్ ప్రకటించగానే సినిమా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ పెద్ద ఎత్తున యుద్ధమే చేశారు. దాంతో కమల్ తన ప్రయత్నాన్ని అప్పట్లో విరమించుకున్నారు. నిర్మాతలకు జియో వల్ల కాసులు వస్తాయి. నిర్మాతలు నష్టపోయే అవకాశం ఉండదు. కానీ తొలిరోజునే టీవీల్లో సినిమా చూసే అవకాశం వస్తే.. థియేటర్‌కు ప్రేక్షకుడు వస్తాడా? అనేది ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికే ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం తగ్గించేశారు. ఇప్పుడు రిలయన్స్.. జియో పైబర్ ప్లాన్‌ను అమలు చేస్తే సినిమా రంగంలో కీలకమైన పంపిణీదారుల వ్యవస్థకు చాలా పెద్ద ఎదురుదెబ్బ తగులుతుంది అనడంలో సందేహం లేదు.

అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ సహా పలు డిజిటల్ మాధ్యమాలు వచ్చిన తర్వాత సినిమాలు సామాన్య ప్రేక్షకుడికి మరింత దగ్గరయ్యాయి. సినిమాలే కాదు.. డిఫరెంట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్‌లు కూడా ఆదరణ పొందుతున్నాయి. కొత్త టాలెంట్‌కి కొత్త దారి దొరికినట్టయ్యింది. ఈ డిజిటల్ మాధ్యమాల్లో సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే సినిమాలు ప్రదర్శించాలనే నిబంధన ఉంది. మరిప్పుడు తొలిరోజునే సెట్ అప్ బాక్స్ ద్వారా సినిమా చూసే అవకాశం అంటే డిజిటల్ మాధ్యమాలకు కూడా జియో సవాలు విసిరినట్లే. ఏదేమైనా జియో ఫైబర్ సేవల వల్ల సినిమా రంగానికి.. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వ్యవస్థకు తిరుగులేని దెబ్బ.. ఓ రకంగా చెప్పాలంటే ఆ వ్యవస్థలను మరచిపోవాల్సిందేనేమో.

Related posts