telugu navyamedia
సామాజిక

జీవన్ యాన్

vijayam poetry corner

నిర్లక్ష్యపు గొడ్డళ్ళు
ఆయువు రేఖలను
నున్నగా గీకుతుంటే
ప్రాణాలను పెరికి
బండరాళ్లను నాటి
అంతస్తుల చెట్లు పెంచుతుంటే
పుడమి ఫ్లూ బారిన పడితే
చందమామ పై
పత్తి మొక్క ఎందుకు చనిపోయిందని
శోధిస్తున్నావు

భూగర్భ జలాలు పాతాళానికి పరుగులు పెడుతుంటే
కాలుష్యం నదుల్ని మింగుతుంటే
వాగులు వంకలు
బావులు చెరువులు
ఆకాశం వంక అర్రులు చాస్తూ
ఆశతో చూస్తుంటే
గుక్కెడు నీళ్ళు ఇవ్వడం మానేసి
బుధుని పై బుడగలో
నీళ్ళున్నాయని
ఎగిరెగిరి చూస్తున్నావ్

అనావృష్టి చీల్చుకు వస్తున్నా
కరువులు కాల్చుకు తింటున్నా
మనిషి మసై పోతున్నా
జీవవైవిధ్యం ప్రదర్శనశాలకే పరిమితమౌతున్నా
మానవ మనుగడపై
చీకట్లు ముసురుతున్నా
ఇసుమంత ఇంగితం మరచి
సూర్యుని పై మచ్చలు కనిపెట్టాలని తహతహలాడుతున్నావు

తల్లీ తండ్రీ
పిల్లా జెల్లా
గొడ్డూ గోదా
పాడీ పంటా
కూడూ గూడూ
తోడూ నీడా
నాలుగు వేళ్ళు
వాడి నోట్లోకి నెట్టలేని పరిశోధన
ఎవరి మేలుకో…
మేలుకో నాగరీకుడా…

మంగళ్ యాన్
చంద్రయాన్
ఆకాశ్ యాన్
గతుల అధ్యయనం సరి
సామాన్యునికి
జీవనయాన గతి మార్చండీ సారి
🙏సైదులు ఆరేపల్లి🙏

Related posts