telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్‌లో కేసీఆర్‌ మనవాళ్ల భూములు తీసేసుకుంటారా: పవన్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. భీమవరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో కేసీఆర్‌ మనవాళ్ల భూములు తీసేసుకుంటారా అని దుయ్యబట్టారు. తెలంగాణ ఏమన్నా పాకిస్థాన్‌ అనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇక్కడ అడ్డదారి రాజకీయాలు చేస్తే వదిలేసే ప్రసక్తి లేదనన్నారు. భయపడుతూ ఎంతకాలం బ్రతుకుతాం, ధైర్యంగా ఉందామని పిలుపునిచ్చారు.

ఆంధ్రులు ద్రోహులు, దోపిడీదార్లు, పనికిమాలినవాళ్లు, దగాకోర్లు అంటూ తెలంగాణ నాయకులు తిడుతుంటే అలాంటి నాయకుల్ని మీ నాయకుడు జగన్‌ భుజానికెత్తుకెళ్తుంటే మీకెలా మనసొప్పుతోందని వైసీపీ నాయకులను అడగాలని అన్నారు. అంత హీనంగా తిడుతుంటే మీరు ఆంధ్రుల పుట్టుకే పుట్టి ఉంటుంటే మీకు పౌరుషమే రాలేదా అని ఆయన వైసీపీ అభ్యర్థులను ప్రశ్నించారు.

తెలంగాణలో ఆంధ్రులు రాజకీయం చేస్తే తప్పా.. కేసీఆర్‌ మాత్రం ఆంధ్ర రాజకీయాలలో వేలు పెట్టవచ్చా అని ప్రశ్నించారు. ఆయనకు ఆంధ్రా మీద అంత అభిమానం ఉంటే తన అభ్యర్థులను బరిలోకి దింపవచ్చని అన్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ఏ మాత్రం సిగ్గు లేకుండా ఇక్కడకు వచ్చి వైసీపీకి మద్దతు ఇస్తారా అని ప్రశ్నించారు.

2014లో టీడీపీ అభ్యర్తిగా ఉన్నప్పుడు తలసాని కేసీఆర్‌ను ఎన్నో తిట్లు తిట్టాడని గుర్తు చేశారు. తన ప్రచారం కోసం తలసాని ఎదురుచూశారని అన్నారు. దయచేసి విభజన రాజకీయాలను మానేయాలని ఆయన తలసానికి సూచించారు. జగన్‌కు కేసీఆర్‌ అంటే భయం. కేసీఆర్‌ ఒక ఉద్యమనాయకుడన్న గౌరవం ఉంది తప్ప తనకు ఆయనంటే భయం లేదని పవన్ అన్నారు. అక్కడేదో తనకు ఇల్లుందని, ఆస్తులున్నాయని, పదెకరాల భూములున్నాయనే భయం తనకు లేదని ఆయన అన్నారు.

Related posts