telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నిర్మాణ రంగ కార్మికుల కోసం .. ఓదార్పు యాత్ర చేయరా.. : జనసేన నాగబాబు

nagababu from kakinada as mp candidate

రెక్క ఆడితే గాని డొక్క ఆడని నిర్మాణరంగ కార్మికులు పనులు లేక ఆదాయం లేక బలవన్మరణాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం కుంటిసాకులు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుందని జనసేన నేత నాగబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతతో నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారు. పనుల్లేక పస్తులు ఉండే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలపై జనసేన పార్టీ సమరశంఖం పూరించింది. విశాఖలో ‘లాంగ్ మార్చ్’ పేరిట ర్యాలీ నిర్వహించేందుకు జనసేన సన్నాహాలు చేస్తోంది. కార్మికుల కోసం అందరం కలిసి పోరాటం చేద్దామని బిజెపి, టిడిపి, వామపక్ష పార్టీలను సైతం లాంగ్ మార్చ్ కు ఆహ్వానించారు జనసేనాని పవన్ కళ్యాణ్. అయితే బిజెపి ఎవరి దారి వారిదే అని తేల్చి చెప్పేసింది. టిడిపి మాత్రం జనసేన పార్టీతో కలిసి నిర్మాణ రంగ కార్మికుల కోసం పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉంది. ఈ పోరాటంపై నాగబాబు తన స్పందన తెలియజేశారు. సీఎం జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఓదార్పు యాత్ర చేసిన నేతకు భవన నిర్మాణ రంగ కార్మికుల కష్టాలు తెలియవా? అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పాటైన ఇంత తక్కువ కాలంలోనే పోరాటాలు చెయ్యాల్సి వస్తుందని పవన్ అనుకోలేదని నాగబాబు పేర్కొన్నారు. ప్రజలకు మంచి పాలన అందించటంలో వైసీపీ ఫెయిల్ అయ్యిందని చెప్పుకొచ్చారు. కష్టాల్లో చిక్కుకున్న కార్మికులకు అండగా నిలిచేందుకే జనసేన పార్టీ ‘లాంగ్ మార్చ్’ నిర్వహిస్తున్నట్టు మెగా బ్రదర్ నాగబాబు వెల్లడించారు.

తన సోదరుడైన పవన్ కళ్యాణ్ కు సామాజిక స్పృహ ఎక్కువని, సమస్యలపై స్పందించే వ్యక్తి అని అందుకే రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తనదైన స్టైల్లో స్పందిస్తారని పేర్కొన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడడం చాలా బాధ కలిగించిందని నాగబాబు తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన చేస్తున్న పోరాటాన్ని మన కోసం మనం చేసే పోరాటంగా భావించాలని మెగా బ్రదర్ నాగబాబు పిలుపునిచ్చారు. నవంబర్ 3వ తేదీన విశాఖలో తలపెట్టిన లాంగ్ మార్చ్ కు ప్రతి ఒక్కరూ తరలివచ్చి నిర్మాణ రంగ కార్మికుల సమస్యల కోసం జనసేన తో కలిసి ముందుకు సాగాలని నాగబాబు వ్యాఖ్యానించారు. ఒక్క విశాఖ నగరంలోనే భవన నిర్మాణ రంగంలో 1.2 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నందున వారందరినీ కలుపుకొని వెళతామన్నారు. మూడో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు మద్దిలపాలెం కూడలిలోని తెలుగు తల్లి విగ్రహం నుంచి స్వర్ణభారతి, రామా టాకీస్‌, ఆర్‌టిసి కాంప్లెక్స్‌ మీదుగా జివిఎంసి గాంధీ విగ్రహం వరకూ లాంగ్‌ మార్చ్‌ జరగనుందని తెలిపారు. అనంతరం ఉమెన్స్‌ కళాశాల ఎదురుగా బహిరంగ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు. ఈ లాంగ్‌ మార్చ్‌కు రాజకీయ పార్టీల నుండి, ప్రజా సంఘాల నుండి మద్దతు లభిస్తోందని మెగా బ్రదర్ నాగబాబు పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నిర్వహిస్తున్న ఈ లాంగ్ మార్చ్ ను సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నాగబాబు పేర్కొన్నారు.

Related posts