telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జనగణమన … వందేమాతరం … వివాదంపై జగ్గయ్య

jaggayya on janaganamana and vandemataram

1983 ఏప్రిల్ 5 వ తేదీ మంగళవారం రాత్రి 7 గంటలకు కొంగర జగ్గయ్య గారు ఇంటర్వ్యూ కు సమయం కేటాయించారు.
లకడీకాపూల్ లో వున్న అశోక హోటల్ లో వున్నారు. కరెక్టుగా ఆయన చెప్పిన సమయానికి వెళ్ళాను. షూటింగ్ నుంచి వచ్చి స్నానం చేసి రెడీగా వున్నారు. ఆయన కూర్చోమని బెల్ కొట్టారు. బాయ్ వచ్చాడు రెండు కాఫీలు చెప్పి ఆయన కూడా కూర్చున్నారు.

డైరెక్ట్ గా సీరియస్ టాపిక్ ఎందుకని ముందుగా …

” నాటక రంగం నుంచి సినిమా రంగానికి వచ్చారు …మీకు నటన అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉందా? ” అడిగాను. ” ఉంది. అయితే నేను కళాకారుడిగా జన్మించక పోవచ్చు … కానీ కళాకారుడిగా జీవనాన్ని సాగించే అవకాశం, అదృష్టం కలిగింది. మనిషి జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితాన్ని సార్ధకం చేసుకోవాలనే నమ్మకం కలవాడిని. అందుకే ప్రతి మనిషీ తన జీవిత కాలం లో నిరంతరం, నిర్విరామ కృషి చెయ్యాలంటాను. మనకు ఎంత తెలిసినా, ఇంకా తెలుసుకోవలసింది, నేర్చుకోవలసింది ఉంతో ఉందని అంటాను. నా దృష్టిలో జీవితమంతా మనం విద్యార్థులమే. నాకు మొదటి నుంచి తెలుసుకోవాలనే కుతూహలం ఉండేది. ఆ కుతూహలమ్మ నన్ను ముందుకు నడిపించింది. ఇక మనం ఏ సమాజంలో బ్రతుకుతున్నామో ఆ సమాజంలోని బాధల్ని, గాధల్ని సమంగా పంచుకొనే బాధ్యతలేని జీవితాలకు సార్ధకత లేదని బలంగా విశ్వసిస్తాను. ” అని చెప్పారు.

“నిజమైన కళాకారుడికి ఉందాల్చిన లక్షణాలు ఏమిటి ?”
” నాటకం లేదా సినిమా ఏ కళాకారుడికైనా పాత్ర పట్ల అవగాహంతో పాటు మానసిక సంఘర్షణ ఎంతో అవసరం. అలాంటి సంఘర్షణ పుట్టేదే నిజమైన నటన. అలాంటి నటులు ఎక్కువ కాలం వుంటారు, పాత్రలో లీనమై నటించినప్పుడే ఆ పాత్రలు ప్రేక్క్షకుల మనస్సులో ఎప్పటికీ ఉండిపోతాయి ” అని చెప్పారు. అదేసమయంలో బాయ్ డోర్ బెల్ కొట్టాడు. జగ్గయ్య గారు “కమిన్ ” అన్నారు.

jaggayya on janaganamana and vandemataramకాఫీ త్రాగిన తరువాత .. జగ్గయ్య గారి వైపు చూశాను. మొదలు పెట్టండి అన్నట్టు తలా ఊపారు.
“మీకు తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యంలో మంచి ప్రవేశముందని తెలుసు. అయితే రవీంద్ర నాథ్ టాగోర్ గీతాలను మీరు “రవీంద్ర గీత ” పేరుతో అనువదించిన తరువాత బెంగాలీ సాహిత్యం గురించి అవగాహన, పట్టు ఉందని తెలిసింది …. టాగోర్ అంటే మీకు అంత అభిమానమా ?”
” రవీంద్ర నాథ్ టాగోర్ అంటే చాలా ఇష్టం … ఆయన రచనలు మరీ ఇష్టం. ముఖ్యంగా గురుదేవుడు రవీంద్రనాథ్ కవితలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి … అందుకే ఆ కవితలను పద్యరూపంలో తెలుగువారికి అందించాను “
“టాగోర్, బంకిం చంద్ర చటోపాధ్యాయ, శరత్ బాబు ముగ్గురు బెంగాలీ సాహిత్యంలోనే కాకుండా భారతీయ సాహిత్యంలో కూడా విశేష ప్రభావం చూపించిన రచయితలు. “అయితే టాగోర్ కన్నా ముందే జన్మించిన బంకిం చంద్ర చటోపాధ్యాయ 1870లో బెంగాల్ లో జరిగిన తిరుగుబాటు ప్రేరణగా వందేమాతరం గీతాన్ని రచించినట్టు చెబుతారు. ఇదే గీతాన్ని 1882లో బంకిం బాబు తన “ఆనంద మఠం” నవల లో చేర్చారు .. ఈ గీతాన్ని 1937లో భారత జాతీయ కాంగ్రెస్ నేషనల్ సాంగ్ గా గుర్తించింది. రవీంద్ర నాథ్ టాగోర్ రచించిన జనగణమన గీతాన్ని మొదట 1911, డిసెంబర్ 27 న కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహా సభలో గానం చేశారు. బంకిం చంద్ర చటోపాధ్యాయ రచించిన వందేమాతరం గీతం మొదట బెంగాల్ ప్రజలను ఆ తరువాత దేశ ప్రజలను ప్రభావితం చేసింది, ఉత్తేజితులను చేసింది. ముఖ్యంగా స్వాతంత్ర్య సముపార్జనలో వందేమాతరం గీతాన్ని ఆలపించి, స్ఫూర్తి పొందని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.

కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత టాగోర్ “జనగణమన ” గీతాన్ని జాతీయ గీతంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరువాత వందేమాతరం గీతాన్ని గుర్తించింది. అందులో న్యాయం ఉందని అనుకుంటున్నారా ?”
జగ్గయ్య గారు కాసేపు నా వైపు అలా చూశారు. “మీ ఉద్దేశ్యం అర్ధమైంది. వందేమాతరం గీతానికి కూడా ఈక్వల్ స్టేటస్, అంటే సమాన ప్రతిపత్తి ఇచ్చారుగా. వందేమాతరం గీతంతో మొదలయ్యే అధికార సభలు జనగణమన తో ముగుస్తాయి. .. అదీ కాక …?”

“వందేమాతరం గీతానికి అన్యాయం జరిగిందనే అసంతృప్తి ప్రజల్లో వచ్చిన తరువాత … చేసిన ప్రకటన అని కూడా అంటారు ” 

” అలాంటిది జరిగిందని అనుకోను. టాగోర్ విశ్వ కవి. భారత దేశానికి నోబెల్ ప్రైజ్ గురుదేవుని వల్లనే వచ్చింది.

“మీ దృష్టిలో టాగోర్ గొప్పవాడా ” శరత్ బాబు గొప్పవాడా ?”
“నిస్సందేహంగా టాగోర్. ఆయన భావుకత్వం అమోఘం, అద్వితీయం … అందుకే దేశమంతా ఆయన్ని విశ్వ కవిగా అభిమానిస్తోంది. అలా అని శరత్ బాబు ను తక్కువ చేయడంకాదు …దిగువ మధ్య తరగతి ప్రజల అభిమాన రచయిత. ఒకానొక సందర్భంలో శరత్ బాబే స్వయంగా చెప్పాడు. తనలాంటి వారికోసం టాగోర్ రచనలు చేస్తాడని … కాబట్టి టాగోర్ విశ్వజనీనమైన సాహిత్యకారుడు”.

jaggayya on janaganamana and vandemataram” మీకు టాగోర్ అంటే ఎంత అభిమానమో నాకు అర్ధమైంది … కానీ … జనగణమన … వందేమాతరం … విషయంలో మాత్రం …” అంటూ జగ్గయ్య గారి వైపు చూశాను. ఆయన నవ్వుతూ షేక్ హాండ్ ఇచ్చారు. ఆ తరువాత అయన ‘రవీంద్ర గీత’  పుస్తకం నాకు బహుకరించారు. అంతకు ముందే ఎవరి పేరో రాశారు. అది కొట్టేసి నాకు ఇవ్వడం ఆయన అభిమానానికి నిదర్శనం.

– భగీరథ

Related posts