telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

మంత్రులందరూ గొప్ప చదువరులే.. ఇదే జగన్ టీం.. !

YCP padma comments Chandrababu

ఏపీసీఎం వైఎస్‌ జగన్‌ మంత్రివర్గంలో అత్యధికులు ఉన్నత విద్యావంతులే. 20 మంది డిగ్రీ, ఉన్నత విద్యను అభ్యసించిన వారు కాగా.. ముగ్గురు అవంతి శ్రీనివాస్‌, శ్రీరంగనాథరాజు, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటర్‌ వరకు చదివారు. కొడాలి నాని, జయరాం పదో తరగతి వరకు చదువుకున్నారు. ముఖ్యమంత్రి తన కేబినెట్‌లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. మొదటి నుంచీ పార్టీకి విధేయులుగా ఉన్నవారికే పెద్దపీట వేశారు. సీనియర్లకు ఎక్కువ అవకాశం ఇచ్చారు.

కేబినెట్‌లో ఖరారైన ఎమ్మెల్యేల నేపథ్యాన్ని పరిశీలిస్తే : అవంతి విద్యా సంస్థల అధినేతగా ప్రసిద్ధుడైన ముత్తంశెట్టి శ్రీనివాసరావు(52) ఇంటర్‌ వరకే చదువుకున్నారు. కానీ అవంతి గ్రూ పుతో 14 ఇంజనీరింగ్‌, ఫార్మా, డిగ్రీ కళాశాలలు నడుపుతున్నా రు. కాపు నేత అయిన ఈయన 2009లో చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీచేసి గెలిచా రు. తర్వాత ఆ పార్టీ కాంగ్రె స్‌లో విలీనం కావడంతో అటు వెళ్లారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రె్‌సను వీడి టీడీపీలో చేరారు. టీడీపీ తరఫున 2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో టీడీపీని వీడి వైసీపీలో చేరారు.

వైఎస్‌కి వీరాభిమానిబోస్. బీఎస్పీ చదివిన ఈయన.. 1978లో కాంగ్రె్‌సలో క్రియాశీల సభ్యుడయ్యారు. 1989లో కాంగ్రెస్‌ నుంచి రామచంద్రపురం నుం చి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచా రు. 2004లో ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్‌ తరపున మూడోసారి ఎమ్మెల్యే గా గెలిచారు. 2004లో వైఎస్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2009లో రెండోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 2011లో రాజీనామా చేశారు. 2012లో జగన్‌ సమక్షంలో వైసీపీ చేరారు. తాజా ఎన్నికల్లో వైసీపీ తరపున మండపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనుభవానికి తోడు బీసీ నాయకుడు కావడం బోస్‌కు కలిసొచ్చింది.

సీనియర్‌ ఎస్సీ నాయకుడైన విశ్వరూప్‌(56).. బీఎస్సీ-బీఈడీ చదివారు. వైఎస్‌పై అభిమానంతో 1989లో ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 1998లో ముమ్మిడివ రం అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీచేసి పరాజయం పాలయ్యారు. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ ఓడిపోయారు. 2004లో మాత్రం విజయం సాధించారు. 2009లో అమలాపురం నుంచి ఆయన పోటీచేసి గెలిచారు. వై ఎస్‌, రోశయ్య మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 ఎన్నికల్లో అమలాపురం ఎంపీ స్థానానికి పోటీచేసి పరాజయం పాలయ్యారు. ఈ దఫా అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి విజయం సాధించారు.

జర్నలిస్టుగా ప్రసిద్ధుడైన కన్నబాబు(50) బీకామ్‌, ఎంఏ పాలిటిక్స్‌, ఎంఏ జర్నలిజం చదివారు. ఈనాడు పత్రికలో ఎన్నో ఏళ్లు జర్నలిస్టుగా పనిచేశారు. చిరంజీని స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి దాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున కాకినాడ రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తదనంతర పరిణామాల్లో ప్రజారాజ్యాన్ని కాంగ్రె్‌సలో విలీనం చేయడంతో అందులో కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2015లో జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరి కొద్దికాలంలోనే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి పార్టీ బలోపేతానికి ఎంతో కృషిచేశారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. కాకినాడ రూరల్‌ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ జువాలజీలో పట్టా పొందిన వనిత(45).. జూనియర్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. ఆమె రాజకీయ కుటుంబానికి చెందినవారు. ఆమె తండ్రి బాబూజీరావు గోపాలపురం నుంచి రెండుసార్లు(1994, 99) టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన వారసురాలిగా 2009 ఎన్నికల్లో తొలిసారిగా ఆ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ, అప్పట్లో స్థానిక రాజకీయాల్లో ఇమడలేక శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. 2013లో వైసీపీలో చేరారు. 2014లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో గెలుపొందారు.

యువజన కాంగ్రె్‌సలో చురుగ్గా పనిచేసిన ఆళ్ల నాని అలియాస్‌ కాళీకృష్ణ శ్రీనివాస్‌.. దివంగత వైఎస్‌కి సన్నిహితుడు. బీకాం చదివిన ఆయన.. 2004లో ఏలూరు నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజకీయాల్లో పట్టు సాధించారు. 2009లోనూ వరుసగా రెండోసారి విజయం సాధించారు. వైఎస్‌ కుటుంబానికి విశ్వసనీయుడిగా పేరొందారు. వైఎస్‌ మరణానంతరం నుంచి జగన్‌ వెంటే నిలిచారు. 2013లో కాంగ్రె్‌సకు, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఏలూరులో పోటీచేసి ఓడిపోయారు. కానీ రెండుసార్లు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో ఎమ్మెల్యే కోటాలో ఆళ్ల నానికి జగన్‌ ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు. 2019లో ఏలూరు నుంచి పోటీకి దిగి గెలుపొందారు.

ఇంటర్‌ వరకు చదువుకున్న శ్రీరంగనాథరాజు(66).. జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా సుదీర్ఘంగా పనిచేశారు. ఆయనది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. 2004లో అత్తిలి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా తొలిసారి గెలిచారు. భీమవరం, పాలకొల్లు, ఉండి నియోజకవర్గాలో రాజకీయంగా తన ప ట్టు నిలబెట్టుకుంటూ వచ్చారు. పెద్దఎత్తున సామాజిక సేవ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ వచ్చారు. వైఎస్‌ మరణానంతరం వైసీపీలో చేరారు.

మాలగుండ్ల శంకరనారాయణ కురుబ సామాజిక వర్గానికి చెందిన వారు. స్వగ్రామం ధర్మవరం. బీకామ్‌ ఎల్‌ఎల్‌ బీ చదివి.. న్యాయవాద వృత్తి నుంచి టీడీపీలోకి వచ్చారు. 2011లో వైసీపీ అవిర్భావంతో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరా రు. ప్రారంభంలోనే ఆయన ను జిల్లా కన్వీనర్‌గా నియమించడం విశేషం.

నాలుగు దఫాలుగా గుడివాడ ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (47).. ఎన్టీఆర్‌కు వీరాభిమాని. జూనియర్‌ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. 2004, 09ల్లో టీడీపీ నుంచి.. 2014, 19ల్లో వైసీపీ నుంచి గెలిచిన ఆయన పదో తరగతి వరకు చదువుకున్నారు. 1999లో అన్న టీడీపీ తరుపున గుడివాడ నుంచి హరికృష్ణను పోటీ చేయించారు. 2004 నాటికి గుడివాడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని టీడీపీ టికెట్‌ సంపాదించి ఆ పార్టీ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్‌ మరణానంతరం జగన్‌కు మద్దతు పలికారు. వైసీపీలో చేరి కీలక నేతగా మారారు. మంత్రి పదవి రూపంలో అందుకు ప్రతిఫలం దక్కింది.

రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన పేర్ని వెంకట్రామయ్య అలియాస్‌ నాని(52).. తండ్రి, మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తిలాగే చా లా సాత్వికుడు.. వివాదరహితుడు. బీకాం చదివిన నాని.. తండ్రి మరణానంతరం రాజకీయ ప్రవేశం చేశారు. 1999లో కాంగ్రెస్‌ తరపున మచిలీపట్నంలో పోటీచేసి ఓడిపోయారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. ప్రభుత్వ విప్‌గానూ పనిచేశారు. వైఎస్‌ మరణానంతరం జగన్‌కు మద్దతిచ్చారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయా రు. తాజా ఎన్నికల్లో విజయం సాధించారు. జగన్‌ ఆయన్ను మంత్రిని చేశారు.

వ్యాపార ప్రముఖుడైన వెల్లంపల్లి శ్రీనివాసరావు(47).. వైశ్యుల కోటాలో మంత్రివర్గంలో చోటు సంపాదించారు. బీకాం పట్టభద్రుడైన ఆయన.. కోకోకోలా డీలర్‌. వస్త్రవ్యాపారి. చిరంజీవి ప్రజారాజ్యాం పార్టీ పెట్టినప్పుడు రాజకీయ అరంగేట్రం చేశారు. విజయవాడ పశ్చిమ స్థానం నుంచి తొలిసారి పోటీచేసి విజయం సాధించారు. తదనంత రం చిరంజీవి పార్టీని కాంగ్రె్‌సలో విలీనం చేసినప్పుడు 2014 వరకూ ఆ పార్టీలో కొనసాగారు. అదే ఏడాది బీజేపీలో చేరారు. టీడీపీతో పొత్తుతో మళ్లీ విజయవాడ పశ్చిమ నుంచే బీజే పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ వైసీపీ అభ్యర్థి జలీల్‌ఖాన్‌ చేతిలో ఓడిపోయారు. శ్రీనివాస్‌ రెండేళ్ల కింద వైసీపీలోకి వచ్చా రు. పార్టీ నగర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తాజా ఎన్నికల్లో జలీల్‌ఖాన్‌ కుమార్తెపై విజయం సాధించారు.

కడప జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం పొందిన అంజాద్‌ బాషా(41)… జగన్‌ను అత్యంత సన్నిహితుడు. పట్టభద్రుడైన బాషా 2005లో జరిగిన కడప మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కార్పొరేటర్‌గా గెలుపొంది కీలకంగా వ్యవహరించారు. వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. వైసీపీ కడప నగర కన్వీనర్‌గా వ్యవహరిస్తూ 2014 ఎన్నికల్లో కడప నుంచి పోటీ చేసి 40వేలకు పైగా మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు. తాజా ఎన్నికల్లో 54,794 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

తొలి నుంచీ తన పక్షాన నిలవడంతో సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు(47) తగిన గుర్తింపు ఇచ్చారు. బీఏ చదువుకున్నారు. 2009లో ప్రత్తిపాడు నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన సుచరిత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం జగన్‌ వెంట నడిచారు. 2012లో జగన్‌ ఇచ్చిన పిలుపుతో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. తరువాత వైసీపీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

రైల్వేలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆదిమూలపు సురేశ్‌(55) 2009లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రోత్సాహంతో యర్రగొండపాలెం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్‌ మరణంతో జగన్‌ వెంట నడిచారు. 2014లో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గెలిచారు. 2019లో యర్రగొండపాలెం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందారు. ఆయన కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్‌ చేశారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి(54). ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ఐదోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. 1999, 2004, 2009, 2012లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఓడిపోయినా.. 2019లో విజయం సాధించారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి బంధువు. అంతేకాదు. ఆయన కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. గనులు, చేనేత, చిన్నతరహా పరిశ్రమల విభాగాలకు మంత్రిగా ఉన్నారు. వైఎస్‌ తోడల్లుడు, మాజీ ఎంపీ అయిన వైవీ సుబ్బారెడ్డి సోదరినే శ్రీనివాసరెడ్డి వివాహం చేసుకున్నారు.

మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజకీయ వారసుడిగా గౌతమ్‌రెడ్డి(47) రాజకీయ ప్రవేశం చేశారు. జగన్మోహన్‌రెడ్డికి చాలా సన్నిహితుడు. ఆత్మకూరు నుంచి 2014లో తొలిసారిగా వైసీపీ ఎమ్మెల్యేగా పోటీచేసి 31,438 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019లోనూ మరోసారి అక్కడి నుంచే విజయం సాధించారు. దేశ విదేశాల్లో కేఎంసీ సంస్థ అధినేతగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ చేశారు.

వైసీపీలో అనతికాలంలోనే ఎదిగిన డాక్టర్‌ పోలుబోయిన అనీల్‌కుమార్‌ యాదవ్‌కు(39) పేరుంది. చెన్నై ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ నుంచి దంతవైద్యుడిగా పట్టా పొందారు. 2008లో కాంగ్రెస్‌ తరఫున నెల్లూరు మున్సిపల్‌ కౌన్సిలర్‌గా రాజకీయ రంగప్రవేశం చేశారు. 2009లో నెల్లూరు సిటీ నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి 90 ఓట్ల తేడాతో పీఆర్పీ అభ్యర్థి శ్రీధర్‌కృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి శ్రీధర్‌కృష్ణారెడ్డి(టీడీపీ)పై 19వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2019లో మంత్రి నారాయణ(టీడీపీ)పై విజయం సాధించారు. జగన్‌కు ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందారు.

టీడీపీలో సామాన్య కార్యకర్తగా రాజకీయ అరంగేట్రం చేసిన గుమ్మనూరు జయరాం… 2006లో జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ రాకపోవడంతో ప్రజారాజ్యం పార్టీ తరపున ఆలూరు నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆలూరు నుంచి అదే పార్టీ టికెట్‌పై పోటీ చేసి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కోడలు కోట్ల సుజాతమ్మపై 39 వేలు పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయం అందుకున్నారు. జయరాంకు ఇప్పటికీ వ్యవసాయమే జీవనాధారం. ఆయన ఎస్‌ఎ్‌ససీ వరకూ చదువుకొన్నారు.

రాష్ట్రంలో అత్యంత సీనియర్‌ నాయకుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (67)ఒకరు. ఎంఏ, పీహెచ్‌డీ చదివిన ఈయన రాజకీయ నాయకునిగా, కాంట్రాక్టర్‌గా ఉన్నారు. 1978లో పీలేరు అసెంబ్లీ స్థానానికి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1989లో కాంగ్రెస్‌ తరఫున పీలేరు ఎమ్మెల్యేగా పోటీచేసి తొలిసారి విజయం సాధించారు. 1994లో ఓటమి చెందారు. 1999లో మళ్లీ గెలిచారు. 2009 ఎన్నికల్లో పుంగనూరుకు వచ్చి కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, రోశయ్య కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు.

ఎస్సీ సామాజిక వర్గానికి (మాల) చెందిన నారాయణస్వామి… క్షేత్రస్థాయి నుంచి ప్రజా ప్రతినిధిగా ఎదిగారు. బీఎస్సీ చదివిన ఆయన.. 1994లో సత్యవేడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1999లోనూ ఓడిపోయారు. 2004లో మాత్రం ఘనవిజయం సాధించారు. 2009లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. వైఎస్‌ మృతి తరువాత వైసీపీలో చేరి 2011 నుంచి 2018 వరకు ఆ పార్టీ జిల్లా కన్వీనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కాగా, నియోజకవర్గాల పునర్విభజనతో 2014లో గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా నారాయణస్వామి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ పోటీ చేయగా, ఆమెపై 20,826 ఓట్ల మెజారిటీతో నారాయణస్వామి గెలుపొందారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కుతూహలమ్మ కుమారుడు ఆనగంటి హరికృష్ణపై 45,695 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం, పట్టుదల ఆయన సొంతం.

Related posts