telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

వివేకా దారుణ హత్య నేపథ్యంలో.. ప్రచారం రద్దు చేసుకున్న జగన్.. గవర్నర్ కు పిర్యాదు..

YS Jagan Files Nomination Pulivendul

నేటి ఎన్నికల ప్రచార సభను వైసీపీ అధినేత వైఎస్ జగన్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం నేపథ్యంలో రద్దు చేసుకున్నారు. నేడు ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని జగన్ భావించారు. అనంతరం గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు. అయితే, వివేకా హత్య తర్వాత పులివెందుల చేరుకున్న జగన్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో నేటి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.

జగన్ వరుసగా నాలుగు రోజుల పాటు(రేపటి ఆదివారం నుంచి) ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న జగన్ 18న పాణ్యం నియోజకవర్గంలో, 19న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో, 20న నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ కేంద్రంలో‌ ప్రచారం నిర్వహిస్తారు.

నేటి సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలుసుకోనున్నారు. పార్టీ నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లనున్న జగన్.. వివేకానందరెడ్డి హత్య విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లనున్నారు. దీనితో పాటు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ హత్యలను గవర్నర్ దృష్టికి తెస్తారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు ఈ హత్యలు నిదర్శనమని ఆయనకు ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు, వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు నిర్వహించాలని కార్యకర్తలకు వైసీపీ పిలుపునిచ్చింది. నల్లచొక్కాలు, నల్ల రిబ్బన్లు ధరించి గాంధీ విగ్రహాల వద్ద నల్లజెండాలతో ప్రదర్శనలు చేపట్టనున్నారు.

Related posts