telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

చంద్రయాన్ 2 … రిహార్సల్స్ పూర్తి.. ఇస్రో విజయం చారిత్రాత్మకం..

isro reharsals on chandrayan 2 grand success

ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చంద్రయాన్-2 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది ఇస్రో. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జలై-15,2019 తెల్లవారుజామున 2:51 గంటలకు జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3-ఎం 1 రాకెట్ ద్వారా చంద్రయాన్-2ను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఆదివారం(జులై-14,2019)ఉదయం 6:51గంటల నుంచి దీనికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అయితే శుక్రవారం(జులై-12,2019)లాంచింగ్ రిహార్సల్ జరుగుతుంది.

ఈ సందర్భంలో ఇస్రో శాస్త్రవేత్తలందరూ కొంచెం టెన్షన్ ఫీలవుతున్నారు. ఫుల్ డ్రస్ రిహార్సల్(FDR) ఇవాళ(జులై-11,2019)సాయంత్రం 7:30గంటలకు పూర్తి అయినట్లు చంద్రయాన్-2 సైంటిస్ట్ ఒకరు తెలిపారు. FDR కంప్లీట్ అయిన తర్వాత లాంచ్ రిహార్సల్స్ కోసం ఇస్రో సిద్దమవుతుందని,సిస్టమ్స్ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాయో చూసేందుకు డమ్మీ కమాండ్స్ ని పంపించనున్నట్లు తెలిపారు. మొత్తం సిగ్నల్స్,కమ్యూనికేషన్ లింక్స్ శుక్రవారం జరిగే ఈ రిహార్సల్స్ లో టెస్ట్ చేయడం జరగుతుందని ఆయన తెలిపారు. దీని తర్వాత లాంచ్ వెహికల్(GSLV-MKlll)సిస్టమ్స్,ఆర్బిటర్,విక్రమ్ హెల్త్ చెకింగ్,మరికొన్ని టెస్ట్ లు జరుగుతాయని తెలిపారు.

ఇస్రో…చంద్రయాన్‌-2 ద్వారా ఆర్బిటర్‌, లాండర్‌, రోవర్‌ను పంపనుంది. సెప్టెంబర్ 6 లేదా 7 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర రోవర్ ల్యాండ్ అవుతుంది. పదేళ్ల క్రితం ప్రయోగించిన చంద్రయాన్-1కు అడ్వాన్స్‌డ్ వెర్షన్ ఈ చంద్రయాన్-2. భారత రెండో మూన్ మిషన్ చంద్రయాన్‌-2 ఉపగ్రహంలో 13 పే లోడ్‌లు (ఆర్బిటర్‌లో 8, ల్యాండర్‌లో 3, రోవర్‌లో 2 పేలోడ్లు) ఉంటాయి. అయితే చంద్రయాన్ మిషన్ కి సంబంధించి కొన్ని ఆశక్తికర విషయాలు ఉన్నాయి. చంద్రయాన్ ప్రాజెక్టుకి అయిన మొత్తం ఖర్చు…వందల హాలీవుడ్ సినిమాల బడ్జెట్ కన్నా చాలా తక్కువ. చంద్రయాన్ -2 మిషన్ మొత్తం ఖర్చు రూ.978కోట్లు మాత్రమే. అతి తక్కువ ఖర్చుతో భారత్ చంద్రయాన్ ప్రాజెక్టుని పూర్తి చేసింది. చంద్రుడి ఉపరితలంపై విస్తృత పరిశోధనలే లక్ష్యంగా చంద్రయాన్‌-2ను ఇస్రో చేపట్టనుంది. ఇంతవరకూ ఏ దేశం చేరుకోని చంద్రుని దక్షిణ భాగం వైపు వెళ్లడానికి ఇస్రో ప్రణాళిక వేసింది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే చంద్రునిపై వ్యర్థ రహిత అణుశక్తి మూలకాల లభ్యతపై ఇస్రో అధ్యయనం చేయనుంది. ఈ అణుశక్తి ట్రిలియన్‌ డాలర్ల విలువ చేయనుంది.

ఇస్రో చంద్రయాన్‌-2లో పంపనున్న రోవర్‌ ద్వారా నీరు, హీలియం-3 జాడ కోసం చంద్రుని ఉపరితలంపై పలు నమూనాలను విశ్లేషించనుంది. ఆ మూలకాలను చంద్రుడి నుంచి భూమికి తీసుకురాగలిగే సామర్థ్యం ఉన్న దేశాలు ఈ ప్రక్రియను తమ చెప్పుచేతల్లో పెట్టుకొనే అవకాశం లేకపోలేదు. ఈ ప్రయోగంతో భారత స్థానాన్ని చంద్రయాన్‌-2 మరింత పటిష్ఠం చేయనుంది. ఇటీవల ఇస్రో చైర్మన్ కే శివన్ మాట్లాడుతూ…ఇప్పటి వరకూ చంద్రునిపై ఎవ్వరూ చేరుకోని ప్రాంతానికి మేం ప్రయోగం చేస్తున్నాం. చంద్రుని దక్షిణ ధ్రువానికి ఈ ప్రయోగాన్ని నిర్దేశించనున్నాం. ఆ ప్రాంతం గురించి మొదటిసారిగా ప్రపంచానికి తెలియజేయనున్నామని తెలిపారు.

Related posts