telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఇస్మార్ట్ శంకర్” మా వ్యూ

Ismart-Shankar

బ్యానర్ : పూరీ కనెక్ట్స్‌
నటీనటులు : రామ్‌, నభా నటేశ్‌, నిధి అగర్వాల్‌, సత్యదేవ్‌, సయాజీ షిండే తదితరులు
దర్శకత్వం: పూరి జగన్నాథ్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రాఫర్‌: రాజ్‌ తోట
నిర్మాతలు: పూరి జగన్నాథ్‌, ఛార్మి

డాషింగ్ డైరెక్టర్ పూరికి చాలా కాలంగా హిట్ అనే మాటే కరువైంది. గతంలో తెలుగు తెరపై పూరీ జగన్నాథ్ తన మ్యాజిక్‌ చూపించి సంచలన విజయాల్ని నమోదు చేసుకున్నారు. అయితే కొన్నాళ్లుగా పూరి బాగా వెనుకబడిపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి పూరీని నిరాశ పరిచాయే తప్ప మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని బలంగా భావించిన పూరీ తనదైన మార్క్ రొమాంటిక్ మాస్ మసాలాగా”‘ఇస్మార్ట్‌ శంకర్‌”ని రూపొందించాడు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్లను మాస్ మసాలాతో నింపేశాడు పూరీ. దానికి తోడు రామ్ ఎనర్జీ కూడా బాగా తోడైంది. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో సినిమాపై యూత్ లో భారీగా క్రేజ్ ఏర్పడింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోగలిగిందా ? రామ్-పూరి కాంబినేషన్ తెరపై మ్యాజిక్ చేయగలిగిందా ? హీరోయిన్ల గ్లామర్ సినిమాకు ఎంత వరకు ఉపయోగపడింది ? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ :
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉండే శంకర్‌ (రామ్‌) ఓ కిరాయి రౌడీ. డబ్బు కోసం ఏమైనా చేస్తుంటాడు. ఆ క్రమంలోనే శంకర్ కు చాందిని (నభా నటేష్) పరిచయం అవుతుంది. ఆమె ఓ డీల్ నిమిత్తం శంకర్ ను కలుస్తుంది. వారిద్దరి ప్రేమాయణం హాయిగా నడుస్తుండగా… శంకర్ డబ్బు కోసం ఓ హత్య చేస్తాడు. అయితే ఆ హత్య తరవాత జైలుకు వెళ్లిన శంకర్… అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి సిబిఐ అధికారులకు దొరికిపోతాడు. అక్కడ సైంటిస్ట్‌ పింకీ (నిధి అగర్వాల్‌) సాయింతో ఓ ప్రయోగం చేస్తారు సిబిఐ వాళ్ళు. శంకర్ మైండ్ లో సీబీఐ అధికారి అరుణ్ (సత్యదేవ్‌) జ్ఞాపకాలను ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. అసలు ఆ మెమొరీ కార్డును శంకర్ మైండ్ లో ఎందుకు ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు ? ఆ తరువాత శంకర్ ఏం చేస్తాడు ? శంకర్ లవర్ చాందినికి ఏమైంది ? దీని వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి ? అనేది తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
హీరో రామ్ ఈ సినిమాలో పక్కా మాస్ రోల్ లో నటించాడు. రామ్ గతంలో “దేవదాస్” తరువాత మాస్ పాత్రల్లో నటించలేదనే చెప్పాలి. ఈ చిత్రంలో రామ్ తెలంగాణ యాస‌లో సరికొత్త పాత్ర, మేకోవ‌ర్ ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ లుక్ లోరామ్ తన అభిమానులను సర్ప్రైజ్ చేస్తాడు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే… నభా నటేష్, నిధి అగర్వాల్ గ్లామర్ షో చేయడం కోసం గట్టిగానే పోటీ పడ్డారు. వీరిద్దరి గ్లామర్ షో యూత్ కు కనువిందు చేస్తుంది. నభా నటేష్ మాత్రం రామ్ తో పోటీపడి మరీ నటించింది. కీలకపాత్రలో నటించిన సత్య, సయాజీ షిండే తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
ఎప్పుడూ మాస్ ను టార్గెట్ చేసే డాషింగ్ డైరెక్టర్ పూరీ ఈసారి మెదళ్ల మార్పిడి అనే కొత్త కాన్సెప్ట్‌ని తీసుకున్నారు. కానీ దాన్ని కూడా రివెంజ్‌ డ్రామాలాగే రొటీన్ గా మార్చడంతో సినిమా రొటీన్ గా అన్పిస్తుంది. రామ్‌ పాత్రని తీర్చిదిద్దిన విధానమే ఈ చిత్రానికి ప్రధాన బలం. సినిమా ఫస్ట్ హాఫ్ ఎంతో ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. ఆసక్తికర మలుపుతో ఇంటర్వెల్ సన్నివేశాలు ఉన్నాయి. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం నెమ్మదిగా సాగింది. ఇక మణిశర్మ పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతంలో తనదైన మార్క్‌ చూపించారు మణిశర్మ. సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

రేటింగ్ : 2.5/5

Related posts