telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆస్ట్రేలియా పర్యటనకు ఇషాంత్ శర్మ దూరం..

my best performance is my goal said ishanth

సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ డిసెంబర్ 17న ప్రారంభమవనున్న టెస్టు సిరీస్ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు గురువారం అధికారికంగా ప్రకటించింది. యూఏఈలో ఐపీఎల్ 2020 ఆడుతున్న సమయంలో గాయపడిన ఇషాంత్.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఫిట్‌నెస్ ట్రైనింగ్ పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక రోహిత్ శర్మ కూడా ఎన్‌సీఏలో పునరావాసంలో ఉన్నాడు. డిసెంబర్ 11న రోహిత్ టెస్ట్ సిరీస్ ఆడేది లేనిది తేలనుంది. ‘ఇషాంత్ శర్మ సైడ్ స్ట్రెయిన్ ఇంజ్యూరీ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. కానీ టెస్టు మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేదు. దీంతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి అతడు దూరమయ్యాడు. రోహిత్ శర్మ ఎన్‌సీఏలో పునరావాసంలో ఉన్నాడు. డిసెంబర్ 11న అతని గాయంపై స్పష్టత రానుంది. ఆ తరువాత ఆస్ట్రేలియాలో జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పాల్గొనడంపై నిర్ణయం తీసుకుంటాం’ అని బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూసుకునేందుకు ఐపీఎల్ 2020 తర్వాత రోహిత్ తిరిగి ముంబైకి రావలసి వచ్చింది. ఇప్పుడు రోహిత్ తండ్రి కోలుకుంటున్నాడు. దీంతో రోహిత్ పునరావాసం ప్రారంభించడానికి వీలుపడనుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ టి నటరాజన్‌ను వన్డే జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతున్న యువ పేసర్ నవదీప్ సైనీకి బ్యాకప్ ఆప్షన్‌గా 29 ఏళ్ల నటరాజన్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలిపింది. కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయపడటంతో.. నటరాజన్‌ను బీసీసీఐ టీ20 జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు సిడ్నిలో మొదటి వన్డే ప్రారంభం అయింది. సైనీ అందులో ఆడుతున్నాడు. ఐపీఎల్ 2020‌లో రోహిత్‌ శర్మ గాయపడటం మొదలు ఇప్పుడు తొలి రెండు టెస్టులకు దూరం కావడం వరకు నెల రోజులుగా సాగుతున్న అతని ఫిట్‌నెస్‌ వివాదంలో ఇప్పుడు మరో కొత్త అంశం తెర పైకి వచ్చింది. అసలు రోహిత్‌ గాయం గురించే తనకు పూర్తి సమాచారం లేదని స్వయంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వెల్లడించాడు. అసలు ఒక రకమైన అనిశ్చితి, గందరగోళం కనిపించిందని అతను చెప్పడం ఈ వ్యవహారం ఎలా సాగిందో చెబుతోంది. టీమిండియా కెప్టెన్‌కు, బీసీసీఐకి మధ్య ఎలాంటి సమాచార లోపం ఉందో కూడా ఇది చూపిస్తోంది. ఇక ప్రస్తుతం ఎన్‌‌సీఏలో ఫిట్‌నెస్ ట్రైనింగ్‌లో ఉన్న రోహిత్.. టెస్టు సిరీస్‌లో ఆడేది లేనిది డిసెంబర్ 11న తేలనుంది. ఆ రోజున రోహిత్ ఫిట్‌నెస్‌ను పరీక్షించనున్నారు.

Related posts