telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

టిఫిన్స్ రెండుసార్లు తింటే.. బరువు తగ్గొచ్చా.. ?

is two times breakfast good for health?

బరువు తగ్గడానికి చాలా మంది సులభంగా చేసే ప్రయత్నం రెండు పూటల అల్పాహారం (టిఫిన్లు-దోస, ఇడ్లి, ఉప్మా, వడ, పూరి తదితరమైనవి) తీసుకోవడం; మధ్యాహ్నం అన్నం తీసుకోవడం. దీనితో ఆకలి తీరినట్టుగా ఉంటుంది, అలాగే ఎక్కువ కొవ్వు చేరకుండా ఉంటుంది అని అందరి భావన. కానీ అది చాలా తప్పుడు అభిప్రాయం అంటున్నారు నిపుణులు. ఈ విధంగా తినడం వలన బరువు తగ్గటం పక్కన పెడితే షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అంటున్నారు వారు. దాదాపు కొన్నేళ్లు ఇలా ఆహార అలవాటు కొనసాగించిన వారిలో ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు అంటున్నారు.

ఇక వీటికి తోడుగా ఆకలి వేసినప్పుడల్లా టీ, కాఫి నీళ్లు కడుపులో వేసేస్తున్నారు చాలా మంది. ఇది కూడా దీర్ఘకాలికంగా పెద్ద పెద్ద సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు నిపుణులు. ఇవన్నీ తీసుకోవడం వలన జీర్ణ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం పుష్కలంగా ఉందట.

అందుకే అవన్నీ వదిలిపెట్టి, పాతకాలంలో పెద్దలు తిన్న ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ మూడుపూటలా ఏదో ఒకటి తినడం అలవాటు చేసుకున్నవాళ్ళు చాలా మందే ఉన్నారు. వీరందరూ అధిక బరువు సమస్య కనపడగానే రెండుపూటలా అల్పాహారం, ఒక పూట భోజనం అంటూ మొదలు పెట్టారు.

ఈ అల్పాహారంలో కూడా ఇడ్లి అన్నిటికంటే కాస్త శ్రేష్టం,కానీ దీనిలోకి వాడే సాంబారు, చట్నీ, కారం లాంటివి సమస్యలు తెచ్చిపెడతాయి. ఇక దోశ విషయానికి వస్తే, అందులో వాడే మినప్పప్పులోనే బియ్యంతో పోలిస్తే ఎక్కువ క్యాలరీలు ఉంటాయని అంటున్నారు. ఇలా ప్రతి రోజు ఇవి అల్పాహారంగా తీసుకుంటే ప్రేగులు వాటి శక్తిని కోల్పయి, జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. దానితో సమస్యలు మొదలవుతాయి. ఇటువంటి వారికి సులభంగా షుగర్ వ్యాధి వస్తుంది అంటున్నారు.

రాత్రి పాలలో తోడు వేశాక అందులో కాస్త అన్నం కూడా వేసి, దానిని ఉదయాన్నే తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మొలక గింజలు, పండ్లు, ఖర్జురా వంటివి ఉదయం ఆహారంలో తీసుకుంటే రోజు ఉత్సాహంగా ప్రారంభం కావడమే కాకుండా, రోజువారీ పని చేసుకునే శక్తి లభిస్తుంది. మధ్యాహ్నం భోజనంతో కానిచ్చేయాలి. రాత్రికి కూడా లైట్ గా, తేలికగా అరిగే ఆహారంతో రోజును ముగించాలి. ఇప్పటి జీవన విధానంలో ఇదే సరైన పద్దతి అంటున్నారు నిపుణులు.

Related posts